Child Marriages

Child Marriages: తెలుగు రాష్ట్రాల కంటే కాశ్మీర్ బెటర్..! పెరుగుతున్న బాల్య వివాహాలు

Child Marriages: భారతదేశంలో సామాజిక మార్పులు వస్తున్నప్పటికీ కొన్ని అంశాలు ఇంకా తీవ్ర ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బాల్య వివాహాల ధోరణి ఇంకా పురుషుల ఆత్మహత్యల శాతాలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు పలు దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించాయి. చట్ట ప్రకారం వయసు రాకముందే పెళ్లి పీటలు ఎక్కుతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికంగానే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

బాల్య వివాహాల్లో బెంగాల్ ఫస్ట్.. 7, 8 స్థానాల్లో ఏపీ, తెలంగాణ!

నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) నివేదిక ప్రకారం.. దేశంలో చట్టబద్ధమైన వయస్సు రాకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది. అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వయసు అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.

దేశంలో సగటున 23.3% మంది బాలికలకు 18 ఏళ్లలోపే, అలాగే 17.7% మంది బాలురకు(అబ్బాయి) 21 ఏళ్లు నిండకుండానే వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాల్లో పశ్చిమ బెంగాల్ 41.6 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, బీహార్ 40.8 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ 29.3 శాతంతో 7వ స్థానంలో, తెలంగాణ 23.5 శాతంతో 8వ స్థానంలో నిలిచి ఆందోళన కలిగిస్తున్నాయి.

దేశంలోనే అత్యంత తక్కువగా జమ్మూ కాశ్మీర్‌లో కేవలం 4.5% మందికి మాత్రమే బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇక కేరళలో 21 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయిల సంఖ్య అత్యల్పంగా (1.4%) ఉంది.

పురుషులపై కేసులు.. బెంగాల్‌లోనే టాప్!

వివిధ రకాల గృహ హింస మరియు ఇతర వివాదాల కారణంగా భర్తలపై, పురుషులపై భార్యలు కేసులు పెడుతున్న సంఖ్య కూడా దేశంలో పెరుగుతోంది. అయితే ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు కాస్త నయమనే చెప్పాలి.

ఈ ఏడాది ఫిబ్రవరి నాటి గణాంకాల ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో పురుషులపై 10.54 లక్షల కేసులు నమోదయ్యాయి.ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (5 లక్షలు), రాజస్థాన్‌ (3.68 లక్షలు) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 42,233 కేసులు, తెలంగాణలో 83,911 కేసులు పురుషులపై నమోదయ్యాయి.

దేశంలో పెరుగుతున్న పురుషుల ఆత్మహత్యలు

మరోవైపు, దేశ జనాభాలో మహిళల కంటే పురుషుల ఆత్మహత్యల రేటు విపరీతంగా పెరుగుతుండటం సామాజిక నిపుణులను కలవరపెడుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు సగటున 12.3 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.

మొత్తం ఆత్మహత్యల్లో దాదాపు 73 శాతం పురుషులవే కావడం గమనార్హం. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల ఒకే ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,24,730 మంది పురుషులు ప్రాణాలు తీసుకోగా, 46,648 మంది మహిళలు ఆత్మహత్యకు శరణు చొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *