Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని తుమ్మలపెంట వేదికగా నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘మత్స్యకారుల సేవ’ కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.30 లక్షలకు పైగా మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి విడుదల చేశారు. వేట నిషేధ సమయంలో పూట గడవని మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసా
సముద్రంలో చేపల వేట అనేది ఎంతో ప్రాణసంకటమైన, గుండె ధైర్యం కావాల్సిన పని అని సీఎం చంద్రబాబు కొనియాడారు. “ఎగిసిపడే అలలకు ఎదురెళ్లి, జీవనోపాధి కోసం రోజుల తరబడి కుటుంబాలను వదిలి సముద్రంలోనే గడుపుతారు. తుపాను వస్తే కనీసం కుటుంబసభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేని పరిస్థితి వారిది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఇబ్బంది కలగకుండా చరిత్రలో తొలిసారిగా రూ.262 కోట్ల భారీ నిధులను విడుదల చేశామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని 1,30,796 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుండగా, ప్రతి కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. కేవలం నెల్లూరు జిల్లాలోనే 11 వేల కుటుంబాలకు రూ.28 కోట్ల నిధులను సీఎం విడుదల చేశారు. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందించినట్లు ఆయన గుర్తుచేశారు.
బోటు మనదే.. వేట మనదే!
ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర హక్కులను కాపాడటంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం హెచ్చరించారు. మన జలాల్లోకి ఇతర రాష్ట్రాల బోట్లు వస్తే శాటిలైట్ (ఉపగ్రహ) సాంకేతికతతో గుర్తించి వెంటాడతామని స్పష్టం చేశారు. “ఇతర రాష్ట్రాల బోటు చొరబడగానే కలెక్టర్‌కు వెంటనే మేసేజ్ వస్తుంది. మనం అప్రమత్తమై ఎవరినీ రానివ్వం. మన సరిహద్దుల వరకు మన మత్స్యకారులు ఎన్ని చేపలైనా పట్టుకోవచ్చు” అని చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం 60 శాతం భారీ సబ్సిడీతో 200 మెకనైజ్డ్ బోట్లను మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.
జువ్వలదిన్నె హార్బర్‌పై ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో రూ.288 కోట్లతో అత్యంత ఆధునిక ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తున్నామని, ఇప్పటికే 87 శాతం పనులు పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ హార్బర్ మత్స్యకారుల సొంతమని, దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన ఒక పీడకల లాంటిదని, వారి హయాంలో మత్స్య సంపద ఉత్పత్తి వృద్ధి రేటు 4 రేట్లు పడిపోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడమే కాకుండా, ₹21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని వివరించారు.
ప్రపంచ మార్కెట్‌లో ఏపీ రొయ్యల హవా
వ్యవసాయం, నిర్మాణ రంగం తర్వాత రాష్ట్రంలో అత్యధిక మంది మత్స్యసంపదపైనే ఆధారపడి ఉన్నారని సీఎం గుర్తుచేశారు. దేశం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే రొయ్యలలో ఏకంగా 80 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుండటం మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గి, గ్యాస్, ఇంధనం మరియు ఎరువుల కొరత ఏర్పడిందని చెప్పారు. అందువల్ల ప్రజలందరూ అనవసర ఖర్చులు, ప్రయాణాలు తగ్గించుకోవాలని, బంగారం కొంటే మన డబ్బు విదేశాలకు తరలిపోతుందని హితవు పలికారు. తుమ్మలపెంట పరిసర ప్రాంతాలను త్వరలోనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
