Mallikarjun Kharge: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుంటూ ప్రతిపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి ఢిల్లీ వేదికగా దూకుడు పెంచింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు ‘జన మహాభియోగ’ (పీపుల్స్ ఇంపీచ్మెంట్) కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో పౌరుల ఓటు హక్కు తీవ్ర ప్రమాదంలో పడిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాము ఈ పోరాటం చేస్తున్నామని ఆయన ప్రకటించారు.
ప్రధాని, హోంమంత్రి ఆదేశాలతోనే ఈసీ పని చేస్తోంది.. ఖర్గే ఆగ్రహం
ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కేంద్రం దెబ్బతీసిందని ఖర్గే ఆరోపించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఏడు నెలల క్రితమే పార్లమెంట్ ఉభయ సభల్లో 193 మంది విపక్ష ఎంపీలు సీఈసీని తొలగించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టినా, తమ నోటీసులను కేంద్రం ఏకపక్షంగా తిరస్కరించిందని గుర్తుచేశారు.
సీఈసీపై మాకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. సామాన్య ప్రజలకు ఈసీపై నమ్మకం కలగాలి. బలహీన వర్గాలు, మహిళలు, యువత ఓట్లను ఢిల్లీలో కూర్చుని కంప్యూటర్లలో ఒక్క క్లిక్‌తో తొలగించకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం” అని ఖర్గే స్పష్టం చేశారు.
ఈసీ చట్టం-2023పై తీవ్ర విమర్శలు.. కేంద్రంపై విరుచుకుపడ్డ ఖర్గే
డిసెంబర్ 2023లో 145 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేసి ఆమోదించిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం-2023’ కారణంగానే నేడు ఈ అక్రమాలు సాధ్యమవుతున్నాయని ఖర్గే ఆరోపించారు.
ఈ చట్టం ద్వారా ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కవచం కల్పించారని, అలాంటి రక్షణ చివరకు రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేదని విమర్శించారు.
2014 నుంచి అధికారంలో కొనసాగేందుకు కేంద్రం ప్రతి అడ్డదారిని తొక్కిందని, ఎమ్మెల్యేలు-ఎంపీలను చీల్చి, ప్రభుత్వాలను కూల్చి, ఈడీ-సీబీఐ, ఎలక్టోరల్ బాండ్లను వాడుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు చివరికి ‘ఓట్లను సైతం దొంగిలిస్తున్నారని’ ఆరోపించారు.
ఎస్ఐఆర్ (SIR) పేరుతో రాత్రికి రాత్రే కొత్త విధానాన్ని తీసుకొచ్చి బీజేపీ వ్యతిరేక ఓట్లను పెద్ద ఎత్తున తొలగించే కుట్ర పన్నారని, చొరబాటుదారుల పేరుతో నిజమైన భారతీయ పౌరుల ఓట్లను గల్లంతు చేస్తున్నారని ఆరోపించారు.
సీఈసీపై ఖర్గే సంధించిన 6 ప్రధాన ఆరోపణలు..
-
ఓట్ల చౌర్యం: ఎన్నికల్లో ఓట్ల దొంగతనానికి పథకం ప్రకారం కుట్ర పన్నారు.
-
కోట్లాది ఓట్ల గల్లంతు: దేశవ్యాప్తంగా దాదాపు 13.2 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారు.
-
ఫారమ్-6లో మార్పులు: పార్లమెంట్ అనుమతి లేకుండానే ఓటరు నమోదు ఫారమ్-6లో చట్టవిరుద్ధంగా సవరణలు చేశారు.
-
ఈసీనెట్ (ECINET) ట్యాంపరింగ్: ఈసీనెట్ వ్యవస్థ కోసం ఓటర్ల జాబితాల్లో అక్రమంగా మార్పులు చేర్పులు చేశారు.
-
కేంద్రం కనుసన్నల్లో నిర్ణయాలు: సీఈసీ పూర్తిగా ప్రధాని మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకే పనిచేశారు.
-
తోటి కమిషనర్లను పక్కనపెట్టడం: కమిషన్‌లోని మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్లను కీలక నిర్ణయాల ప్రక్రియ నుంచి దూరం పెట్టారు.
ఓటు హక్కుపై దాడి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.. మీరా కుమార్
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని గుర్తుచేశారు.
ప్రజాస్వామ్యానికి ప్రధాన బలం ఎన్నికలేనని, ఆ వ్యవస్థకు ఓటరే ఆత్మ లాంటి వాడని పేర్కొన్నారు. ఏ ఒక్క ఓటరునైనా ఓటు హక్కు నుంచి అన్యాయంగా దూరం చేస్తే, అది భారత ప్రజాస్వామ్య మూలాలకే గొడ్డలిపెట్టని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించేందుకు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ‘ఇండియా’ కూటమి కార్యాచరణ సిద్ధం చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.
