Harish Rao: హైదరాబాద్ శివారులోని మియాపూర్, మంచిరేవుల ప్రభుత్వ భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత టి. హరీష్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “అబద్ధాలకు సీఎం రేవంత్ బ్రాండ్ అంబాసిడర్.. ఆయన చెప్పే అబద్ధాలకు ఏకంగా ఆస్కార్ అవార్డే ఇవ్వొచ్చు” అంటూ ఘాటుగా విమర్శించారు. దశాబ్దాలుగా కోర్టుల్లో నలుగుతున్న ఈ విలువైన భూములను కాపాడటానికి గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన న్యాయపోరాటాన్ని వివరిస్తూ, రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మంచిరేవుల, మియాపూర్ భూములపై కేసీఆర్ హయాంలోనే పోరాటం
ఈ వివాదాస్పద భూములపై గత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఖరిని, బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను హరీష్‌రావు మీడియా ముందుంచారు. మంచిరేవులలోని భూములపై దశాబ్దాలుగా న్యాయపోరాటం జరుగుతోందని, ఆ విలువైన భూములను ప్రైవేట్ వ్యక్తులకు దక్కేలా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ప్రయత్నించాయని ఆరోపించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్‌ను నియమించి, ఈ భూములు ప్రభుత్వానికే దక్కేలా బలమైన వాదనలు వినిపించారని తెలిపారు. మంచిరేవులలో 142 ఎకరాల భూమిని కాపాడింది కేసీఆర్ హయాంలో చేసిన న్యాయపోరాటమేనని స్పష్టం చేశారు.
మియాపూర్ స్కామ్‌లో కేసీఆర్ సర్కారు కఠిన చర్యలు
మియాపూర్ భూముల వ్యవహారంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలను హరీష్‌రావు గుర్తుచేశారు. మియాపూర్ భూముల స్కాం బయటపడగానే కేసీఆర్ ఏమాత్రం ఉపేక్షించకుండా సీఐడీ (CID) విచారణకు ఆదేశించారని తెలిపారు. ఇద్దరు అధికారులను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు, డాక్టర్ ప్రసాద్ సహా ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని వివరించారు.
నిందితుడు డాక్టర్ ప్రసాద్‌పై వచ్చిన జడ్జిమెంటే నిన్న కోర్టు ఇచ్చిన తీర్పుకు బలమైన పునాదిగా మారిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ కృషితోనే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ప్రభుత్వం తరఫున కేసులు గెలవడం సాధ్యమైందని స్పష్టం చేశారు.
23 ఏళ్ల కేసు.. 86 సార్లు వాదించింది వైద్యనాథనే!
మియాపూర్ భూముల వివాదం దాదాపు 23 ఏళ్లుగా నడుస్తోందని హరీష్‌రావు వివరించారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ కేసు ఉమ్మడి రాష్ట్రంలో 85 సార్లు విచారణకు వచ్చిందని, తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 86 సార్లు విచారణకు వచ్చిందని గణాంకాలు వెల్లడించారు.
ఈ 86 విచారణల్లోనూ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ స్వయంగా హాజరై ప్రభుత్వ భూములను కాపాడటానికి గట్టి వాదనలు వినిపించారని, అసలు ఆయనను నియమించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని పేర్కొన్నారు.
ఇదే క్రమంలో 1985 నుంచి నలుగుతున్న భూపాలపల్లి భూముల కేసు 1994 నుంచి 2014 వరకు హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతే దానిపై గట్టి వాదనలు వినిపించి పరిష్కారానికి బాటలు వేశామని గుర్తుచేశారు.
జడ్జిమెంట్ కాపీ రాకముందే భూములు అమ్మే ఆతృత.. హరీష్‌రావు ఎద్దేవా
కోర్టు తీర్పునకు సంబంధించిన అధికారిక జడ్జిమెంట్ కాపీ కూడా చేతికి రాకముందే.. ఆ భూములను వెంటనే అమ్ముకోవాలనే ఆతృత సీఎం రేవంత్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోందని హరీష్‌రావు ఎద్దేవా చేశారు. తాము చేసిన పనులను, సాధించిన విజయాలను రేవంత్ తన ఖాతాలో వేసుకుంటూ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడింది ఎవరో, వాటిని అమ్ముకోవాలని చూస్తున్నది ఎవరో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసని ఆయన వ్యాఖ్యానించారు.
