ఏపీ తీరం వైపు పయనం.. సోమవారానికి సమీపంలోకి!
వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం. ఈ వాయుగుండం క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. సోమవారం (నవంబర్ 2) సాయంత్రం నాటికి ఇది పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి అతి సమీపంలోకి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరానికి చేరువయ్యే కొద్దీ దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయి, రాగల రెండు రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయి.
భారీ నుంచి అతిభారీ వర్షాలు: రాయలసీమ, సెంట్రల్ ఆంధ్రాపై ఎఫెక్ట్
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు..
సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు: ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈదురుగాలుల తీవ్రత: తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.
ఏపీఎస్డీఎంఏ (APSDMA) అప్రమత్తం.. మత్స్యకారులకు స్పష్టమైన ఆదేశాలు
పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ కీలక సూచనలు జారీ చేశారు.
వేటకు వెళ్లొద్దు: సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే సమీప తీరాలకు చేరుకోవాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు రెడీగా ఉండాలి: లోతట్టు, తీరప్రాంత ప్రజలు స్థానిక పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
అధికార యంత్రాంగం ఇప్పటికే ముందస్తు సహాయక చర్యలను సిద్ధం చేసిందని, ప్రజలు పుకార్లను నమ్మకుండా కేవలం వాతావరణ శాఖ, ప్రభుత్వ విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని కోరారు.