Rahul Gandhi

Rahul Gandhi: ఇది శివుడి పెళ్లి ఊరేగింపు లాంటిది.. ఎవరైనా రావచ్చు

Rahul Gandhi: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా విపక్ష ‘ఇండియా’ (INDIA) కూటమి దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ నిరసన పాదయాత్రను ప్రారంభించింది. ఢిల్లీలోని బారాఖంభా రోడ్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ మార్చ్ సాగుతోంది. ఎన్నికల్లో జరిగిన “ఓటు చోరీ”, ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) అక్రమాలకు నిరసనగా సీఈసీ పదవికి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విపక్ష నేతలు సర్వోన్నత న్యాయస్థానంలో అధికారికంగా పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఈ మహాపాదయాత్రలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్, శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్, అరవింద్ సావంత్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, జేఎంఎం నేత మహువా మాఝీ సహా కూటమికి చెందిన పలువురు ఎంపీలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది శివుడి బారాత్ లాంటిది.. ఎవరైనా చేరొచ్చు.. రాహుల్ గాంధీ
పాదయాత్రకు ముందు ఇందిరా భవన్‌లో దాదాపు 40 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు చేపట్టిన ఈ మార్చ్ శివుడి పెళ్లి ఊరేగింపు (శివ్‌జీ కీ బారాత్) లాంటిది. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునే ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావచ్చు అని పిలుపునిచ్చారు.
నాకు జ్ఞానేష్ కుమార్ మెసేజ్‌లు వస్తుంటాయి 
సీఈసీతో మాట్లాడారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..  అవును, ఆయన నుంచి నాకు మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. బహుశా ఆయన ఇప్పుడు ఈ ప్రెస్ మీట్‌ను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు” అని రాహుల్ వ్యాఖ్యానించారు.

నిరసనలపై సుప్రీంకోర్టు స్పష్టత – నిబంధనల ప్రకారమే ప్రవేశం..

ఇండియా కూటమి సుప్రీంకోర్టు వైపు కదులుతున్న వేళ, సుప్రీంకోర్టు అధికారిక వర్గాలు ప్రక్రియపై స్పష్టతనిచ్చాయి.
  • పిటిషన్ దాఖలుకు అడ్డంకులు లేవు:
    దేశంలో ఏ పౌరుడైనా వ్యక్తిగతంగా గానీ లేదా న్యాయవాది ద్వారా గానీ సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. అందుకు ఎలాంటి అభ్యంతరం లేదు.
  • పరిమిత పాసులు మాత్రమే:
    పిటిషన్ వేసేందుకు పరిమిత సంఖ్యలోనే ప్రవేశ పాసులు (Entry Passes) జారీ చేస్తారు. అది కూడా సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణలోనే ఉంటుంది.
  • సుప్రీంకోర్టు నిరసనల వేదిక కాదు:
    ఎవరైనా గుంపులుగా వచ్చి కోర్టు ప్రాంగణంలో రగడ సృష్టించడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని, బయట భద్రతా వలయంలో ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయని హెచ్చరించింది. న్యాయస్థానం కేవలం న్యాయ విచారణలకే పరిమితమని, ఆందోళనల వేదిక కాదని స్పష్టం చేసింది.

‘సీఈసీ రాజీనామా చేసి జైలుకు వెళ్లాల్సిందే’ – నేతల ఆగ్రహం..

బారాఖంభా వద్ద నిరసన సందర్భంగా కాంగ్రెస్, ఎస్పీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. “జ్ఞానేష్ కుమార్ చేసింది పచ్చి రాజ్యాంగ విరుద్ధమైన పని. మేము బయటపెట్టిన ఆధారాలే ఓటు చోరీని నిరూపిస్తున్నాయి. మేము శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిరసన చేస్తుంటే పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేస్తున్నారు, నేతలను జైళ్లలో పెడుతున్నారు. సీఈసీ ఆ పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండే హక్కు లేదు. తక్షణమే రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.
ఆనంద్ భదౌరియా (ఎస్పీ ఎంపీ)
సీఈసీని కేవలం పదవి నుంచి తొలగించడమే కాదు, ప్రజాస్వామ్య ద్రోహానికి పాల్పడినందుకు ఆయన్ను జైలుకు పంపేంతవరకు ఈ పోరాటం ఆగదు. మా పోరు అలుపెరగకుండా సాగుతుంది అని స్పష్టం చేశారు.
భూపీందర్ సింగ్ హుడా
ప్రజల గొంతును నొక్కేయాలని పాలకులు చూస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలను ఎవరూ అణచివేయలేరు. పాలకుల్లో మొదలైన భయమే ఈ అణచివేతలకు నిదర్శనం అని పేర్కొన్నారు.
కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వద్ద మొదలైన నిరసన నినాదాలు ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గంలో మార్మోగుతున్నాయి. విపక్ష ఎంపీలు న్యాయస్థానంలో ఎలాంటి పిటిషన్ దాఖలు చేస్తారు, సుప్రీంకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందనేది దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *