FSSAI

FSSAI: రూ.200 లక్షల కోట్ల మార్కెట్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ ఉక్కుపాదం.. పెరగనున్న ఖర్చులు.. చివరికి భారం ఎవరిపై?

FSSAI: భారతదేశంలో దాదాపు రూ. 200 లక్షల కోట్ల విలువైన భారీ కన్స్యూమర్ మార్కెట్‌పై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) నిఘా కొరడా ఝుళిపిస్తోంది. రోడ్లపై అమ్మే పనీర్, స్వీట్ల నాణ్యత మొదలుకొని ఖరీదైన మద్యం సీసాలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ల కిచెన్ల నుంచి ఆన్‌లైన్ క్విక్ కామర్స్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల వరకు నియంత్రణ సంస్థ తన తనిఖీలను ముమ్మరం చేసింది.
ఈ పరిణామం వల్ల తక్షణమే కంపెనీల వ్యాపార రాబడులపై పెద్దగా ప్రభావం పడకపోయినప్పటికీ.. వ్యాపార నిర్వహణ ఖర్చులు (Compliance & Operating Costs) భారీగా పెరగనున్నాయి. అయితే, కఠిన నిబంధనల అమలు కోసం కంపెనీలు పెట్టే ఈ అదనపు ఖర్చుల భారం చివరికి సామాన్య వినియోగదారుడి జేబుపైనే పడనుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం బ్రాండ్లపై గట్టి దెబ్బ – ఫార్ములాల్లో మార్పులు..
ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ చర్యల తీవ్రత మద్యం తయారీ కంపెనీలపై స్పష్టంగా కనిపించింది.
18 వేల బాక్సుల సీజ్..
పాత బాటిళ్లను రీసైకిల్ చేసే నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంతో ప్రముఖ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ బెంగళూరు ప్లాంట్ నుంచి ఏకంగా 18 వేల మద్యం కేసులను అధికారులు సీజ్ చేశారు. దీనివల్ల స్మిర్నాఫ్ (Smirnoff), డీఎస్పీ బ్లాక్ డీలక్స్, వ్యాట్ 69 (Vat 69) వంటి బ్రాండ్లపై తీవ్ర ప్రభావం పడింది.
ఫ్లేవర్ల వివాదం – ఫార్ములాల మార్పు..
విస్కీ, రమ్ బ్రాండ్లలో కృత్రిమ ఫ్లేవర్లను కలపడంపై అభ్యంతరాలు రావడంతో యునైటెడ్ స్పిరిట్స్ తన ప్రధాన బ్రాండ్ల ఫార్ములాలను మార్చాల్సి వస్తోంది. అటు పెర్నాడ్ రికార్డ్ ప్లాంట్లలోనూ తనిఖీలు జరిగాయి. దీంతో కంపెనీలకు న్యాయపరమైన ఖర్చులు (Legal Costs) విపరీతంగా పెరిగిపోయాయి.
‘100% ప్యూర్’ అనే తప్పుడు ప్రకటనలపై చర్యలు..
నిత్యావసర వస్తువులను విక్రయించే ఎఫ్‌ఎంసీజీ (FMCG) కంపెనీల మార్కెటింగ్ జిమ్మిక్కులకు అడ్డుకట్ట పడింది
  • నిబంధనల ప్రకారం.. శాస్త్రీయ ఆధారాలు లేకుండా ‘100% ప్యూర్’, ‘న్యాచురల్’, ‘ప్రీమియం’ వంటి పదాలను లేబుల్స్‌పై ఇష్టం వచ్చినట్లు వాడటానికి వీల్లేదని ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ స్పష్టం చేసింది.
  • అధికారుల నోటీసుల దెబ్బకు ఆమ్‌వే ఇండియా, ఇమామి, బాన్ బిస్కెట్స్, అపీస్ ఇండియా వంటి సంస్థలు తమ పాత క్లెయిమ్‌లను ఉపసంహరించుకున్నాయి.
  • డాబర్, ఫెర్న్స్ ఎన్ పెటల్స్, లోట్టే ఇండియా వంటి కంపెనీలు కూడా తమ ప్యాకేజింగ్, బ్రాండింగ్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. ఇకపై మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్ తేవాలంటే ల్యాబ్ టెస్టింగ్‌లు, సరికొత్త ప్యాకేజింగ్‌ల కోసం భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది.

కేఎఫ్‌సీ, డొమినోస్, పిజ్జా హట్ ఔట్‌లెట్లకు తాళాలు..

బయట హోటళ్లలో తినే ఆహార నాణ్యతపై విస్తృత స్థాయి తనిఖీలు చేపట్టిన అధికారులు నిబంధనలు పాటించని దిగ్గజ బ్రాండ్లనూ ఉపేక్షించలేదు.
  • మంగళూరు కేఎఫ్‌సీ సీజ్:
    పాడైపోయిన చికెన్ వాడుతున్నారన్న ఫిర్యాదుతో మంగళూరులోని కేఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్‌ను అధికారులు సీజ్ చేశారు. అక్కడ కిచెన్‌లో ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన కుకింగ్ ఆయిల్‌ను కూడా గుర్తించారు.
  • డొమినోస్, పిజ్జా హట్ లైసెన్స్‌ల రద్దు:
    పరిశుభ్రత లోపించడం, సరైన ఆహార నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌కు చెందిన 4 డొమినోస్ ఔట్‌లెట్లు, సఫైర్ ఫుడ్స్‌కు చెందిన 1 పిజ్జా హట్ ఔట్‌లెట్ లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేశారు.

ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లపై నిఘా – చివరికి భారం ఎవరిపై?

కేవలం హోటళ్లే కాకుండా.. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కుళ్లిన, నాణ్యత లేని వస్తువులు డెలివరీ అవుతున్నాయన్న ఆరోపణలతో వాటికి కూడా నోటీసులు వెళ్లాయి.ఈ కఠిన నిబంధనల వల్ల మార్కెట్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి?
  1. ధరల పెంపు ముప్పు
    కంపెనీలు తమ ఉత్పత్తుల టెస్టింగ్‌లు, క్వాలిటీ కంట్రోల్, లైసెన్సింగ్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. వ్యాపార వ్యయం పెరిగితే కంపెనీలు ఆ భారాన్ని సర్దుబాటు చేసుకోవడానికి వస్తువులు, సేవల ధరలను పెంచుతాయి. అంటే నాణ్యమైన, సురక్షితమైన ఆహారం తినాలంటే వినియోగదారులు మరింత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.
  2. చిన్న వ్యాపారుల మనుగడ కష్టం
    ఈ భారీ ల్యాబ్ టెస్టింగ్‌లు, కఠిన నిబంధనలను తట్టుకోలేని చిన్న వ్యాపారులు మార్కెట్ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఉంది.
  3. డైరెక్ట్-టు-కన్స్యూమర్ (D2C) బ్రాండ్లకు అవకాశం
    నకిలీ పనీర్, కల్తీ పాలపై దాడులు జరగడంతో ప్రజలు పారదర్శకంగా ఉండే బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతారు. దీంతో నాణ్యతను మొదటి నుంచే పాటిస్తున్న డీ2సీ సంస్థలకు ఇది కలిసొచ్చే అంశంగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *