Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన ఒక హృదయవిదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జీవితంపై విరక్తి చెందిన ఒక యువకుడు దేవుడికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. “ఓ శివయ్యా, నీ బిడ్డల్లా నా తలరాత ఎందుకు రాయలేదు? మేమేమీ నీ కొడుకులం కాదా?” అంటూ దేవుడిని ప్రశ్నిస్తూ రాసిన ఆ లేఖ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
వేములవాడకు చెందిన 25 ఏళ్ల దీటి రోహిత్, ఎమ్మెస్సీ పూర్తి చేసి బీఎడ్ చదువుతున్నాడు. డాక్టర్ కావాలనే తన కల నెరవేరకపోవడంతో రోహిత్ కొంతకాలంగా తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి అతను తన గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న వేములవాడ పోలీసులు, రోహిత్ రాసినట్టుగా భావిస్తున్న ఒక ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో రోహిత్ దేవుళ్లను ప్రార్థిస్తూ తన బాధను వ్యక్తం చేశాడు. “మతి, తెలివి ఉండి కూడా నా తలరాతను ఇలా రాశావా? అదే నీ కొడుకులకు అలా రాయలేదే? మేము నీకు కొడుకులం కాదా?” అంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు.
Also Read: Nara Lokesh: 2019 ఎన్నికల్లో ఓటమి నాలో కసి పెంచింది..
రోహిత్ తన లేఖలో, “ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న నా కోరిక నెరవేరింది” అని పేర్కొన్నాడు. జీవించడంలో ఉన్న బాధ మరణం కంటే ఎక్కువని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనకు మరో జన్మ వద్దని కూడా అందులో రాశాడు. తన జీవితాన్ని జగన్మాతకు అంకితం చేస్తున్నానని, తన మృతదేహాన్ని కాశీలో దహనం చేయాలనేదే తన చివరి కోరికని రోహిత్ లేఖలో వివరించాడు.
రోహిత్ తండ్రి దీటి వేణుగోపాల్ స్థానికంగా ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ దుకాణం నడుపుతుంటారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.