Kamareddy: తాగిన మైకంలో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. తమ్ముడి భార్య అని కూడా చూడకుండా కర్రతో చితకబాదాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్తి పంపకాల విషయంలో ఏఆర్ కానిస్టేబుల్ సంతోష్ కు అతని సోదరుడు వేణుతో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సంతోష్ ఈ విషయంలో వేణు ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో గొడవకు దిగాడు.
అయితే అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన వేణు భార్య దీనంతా వీడియో రికార్డింగ్ చేస్తుండగా ఆమె ఫోన్ గుంజుకుని ఈ గొడవకు అసలు కారణం నువ్వేనంటూ ఆమెపై కర్రతో దాడి చేశాడు. అప్పుడే కారులో ఇంటికి వచ్చిన వేణు తన భార్యను కొట్టడంతో ఆగ్రహించి అన్న సంతోష్ పై దాడికి దిగాడు. గల్లాలు పట్టుకుని మరి ఇద్దరూ వీధుల్లో రౌడీల్లా రెచ్చిపోయి మరీ కొట్టుకున్నారు. వేణు స్నేహితులు సంతోష్ కు ఎంతో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ అతను వినిపించుకోలేదు.
Also Read: Ranya Rao: యూట్యూబ్‌లో చూసి బంగారం స్మగ్లింగ్ నేర్చుకున్నాను.. అధికారులతో రన్యారావు
పైగా వేణు కారు అద్దాలను కూడా ధ్వంసం చేశాడు సంతోష్ . అనంతరం బావ మరదలు ఇద్దరు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం ఒకరిపై మరోకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వేణు భార్యను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్రమంగా ఇంట్లోకి చొరబడటమే కాకుండా మహిళపై దాడి చేసినందుకు గానూ కానిస్టేబుల్ సంతోష్ పై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ డి ఆంజనేయులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.