Indian Politics: మనకు తెలిసిన వారింటికి పోలీసులు ఏదైనా విషయంపై విచారణ కోసం వచ్చారనుకోండి.. ఒక పది నిముషాలు ఆ ఇంటి వారితో మాట్లాడి వెళ్లిపోయారనుకోండి.. అందరూ ఆ ఇంటి వారిని ఎలా చూస్తారు? కనీసం ఓ నాలుగైదు నెలలు వారిని నేరస్థులుగా చూస్తారు. పోలీసులు ఎందుకు వచ్చారనేది తెలిసినా.. తెలియకపోయినా.. కథలు కథలుగా దానిగురించి మాట్లాడుకుంటారు. మేమే నేరం చేయలేదు.. ఎదో విషయంపై పోలీసులు జస్ట్ ఎంక్వైరీ చేశారంతే అంటూ ఆ ఇంటివారు నెత్తీనోరూ కొట్టుకుని చెప్పినా ఎవరూ నమ్మరు.
ఎదో ఉంది అంటూ ప్రచారమూ ఆగదు. ఒకవేళ ఎవరినైనా మన వీధిలో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఆ వ్యక్తి నేరం ఏమిటనేది పక్కన పెడితే.. వీధిలో ఉన్నవారంతా ఆ కుటుంబం మొత్తాన్ని నేరస్థులుగా చూస్తుంది. నిందితుడిగానే అతను అరెస్ట్ అయినా.. సరే జైలుకు వెళ్ళాడు కాబట్టి అతను నిర్దోషి అని తేలినా.. ఆ కుటుంబం మొత్తాన్ని దాదాపుగా సామాజికంగా వెలివేసినట్టు చూడడం సహజం. ఎటువంటి పరిస్థితిలోనూ ఆ సంఘటనలో తప్పొప్పుల గురించి ఆలోచించడం మెజార్టీ ప్రజలు చేయరు. ఇది నాణేనికి ఒకవైపు.
ఇక నాణేనికి రెండో వైపు చూద్దాం. ఒక ఎమ్మెల్యే లేదా ఒక రాజకీయ నాయకుడు ఎదో పని ఉండి మనం వెళ్లి కలిసాం. ఆ పని చేసి పెట్టాలని అడిగాం. దానికి కొంత సొమ్ము మన దగ్గర లంచంగా తీసుకున్నాడు. సరే అది మనకు సహజమే కదా. మన పని అయితే చాలు అని అనుకునే మనస్తత్వం. కానీ, లంచం తీసుకుని పనిచేశాడని ఆ నాయకుడి గురించి తెలిసిన వారందరి దగ్గరా చెప్పుకుంటాం. అదే రాజకీయ నాయకుడిని పోలీసులు ఒక పెద్ద ఆర్ధిక నేరంలో అరెస్ట్ చేశారు. జైలుకు పంపారు. అప్పుడు మన వెర్షన్ ఎలా మారిపోతుంది.
ఇది కూడా చదవండి: DY Chandrachud: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదు అంటున్న మాజీ సీజేఐ చంద్రచూడ్
Indian Politics: అధికార పక్షం కుట్ర చేసింది. కావాలనే జైలుకు పంపించింది. కక్ష సాధింపు చర్య ఇది. పోయిన ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేపై పోటీ చేసినందుకే ఇలా జరిగింది. పాపం.. ఆయనను అనవసరంగా ఇరికించేశారు. అంటూ బోలెడు సానుభూతి కురిపించేస్తారు. ఇది నిజమే కదా. అవినీతి తిమింగలం అని మనకు తెలిసినా సరే రాజకీయ నాయకుడి దగ్గరకు వచ్చేసరికి మన ఆలోచన మారిపోతుంది. తరువాతి ఎన్నికల్లో సదరు నాయకుడికి ఇంట్లో అందరం గంపగుత్తగా ఓట్లేసి ఎమ్మెల్యేని చేసేస్తారు.
ఇప్పుడు ఈ బొమ్మా బొరుసు లెక్కలు ఎందుకు చెప్పుకుంటున్నామో ఈపాటికి మీకు అర్థం అయి ఉంటుంది. అవును మీరు అనుకునేది కరెక్ట్. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు చూశాకా.. మన ప్రజల ఆలోచనా ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల్లో ఉన్న ఈ బలహీనమైన బొమ్మా.. బొరుసూ.. మనస్తత్వాన్ని క్యాష్ చేసుకోవడం కోసమే కావచ్చు.. దమ్ముంటే అరెస్ట్ చేయి.. చేతనైతే జెయిల్లో పెట్టు వంటి ఛాలెంజ్ లు అధికార పక్ష నాయకులకు విపక్ష జనం చేస్తూ వస్తున్నారనిపిస్తోంది.
ఒక్కసారి ఇలా జైలుకు వెళ్లి వచ్చి ముఖ్యమంత్రులు అయిన వారి గురించి పరిశీలిస్తే.. మనకు బాగా తెలిసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన పార్టీ పెట్టి.. గిరగిరా బొంగరంలా ప్రజల్లో తిరిగినా.. అధికారం దక్కలేదు. ఈలోపు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను జైలుకు పంపించింది సీబీఐ. దీంతో జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి పీఠం కట్టపెట్టారు. తరువాత ఏమి జరిగిందనేది తెలిసిందే కదా.
ఇది కూడా చదవండి: Jharkhand: జార్ఖండ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమి రెడీ
Indian Politics: తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డిని ఏవో అవినీతి కేసుల పేరుతో అరెస్ట్ చేశారు పోలీసులు. జైలుకు వెళ్లివచ్చిన తరువాత సీన్ మారిపోయింది. తరువాతి ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు.అంతకు ముందు కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ కూడా జైలుకు వెళ్లారు. ఆ తరువాత రాష్ట్రాన్ని సాధించారు..ముఖ్యమంత్రి అయ్యారు.
కర్ణాటకలో డీకే శివకుమార్.. కూడా అంతే. జైలుకు వెళ్లారు. ( ఇక్కడ కారణాలు, నిజానిజాలు గురించి చర్చించడం లేదు) తరువాతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూచోపెట్టారు. తాజాగా.. తీసుకుంటే, ఏపీలో చంద్రబాబు నాయుడును ఇరుకున పెట్టాలని జగన్మోహన్ రెడ్డి వేసిన ప్లాన్.. ఎదురుతన్నింది. 53 రోజుల పాటు చంద్రబాబును రాజమండ్రి జైలులో నిర్బంధించారు. దానికి మూల్యం చెల్లించుకున్నారు జగన్. పార్టీ మనుగడే కష్టం అయ్యేలా.. కనీస ప్రతిపక్ష హోదా కూడా దక్కని విధంగా ఓటమి పాలయ్యారు. చంద్రబాబు నాయుడు తిరుగులేని శక్తిగా ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పుడు లేటెస్ట్ గా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర అవినీతి ఆరోపణల్లో మునిగిపోయారు. అవినీతి విషయంలో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. ఆరు నెలల తరువాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయన బంపర్ మెజార్టీతో గెలిచి సీఎం పీఠం పై కూచున్నారు. ఇక్కడ కారణాలు.. నిజాలు అన్నీ పక్కన పెడితే.. సారూప్యాల విషయమే తీసుకుంటే.. జైలుకు వెళ్లివచ్చిన నాయకులు అధికార అందలం అందుకుంటున్నారు.
ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయింది అంటే.. అధికారంలో ఉండగా అవినీతి చేసినా.. అన్యాయం చేసినా.. అవన్నీ బయటపడినా సదరు నాయకులపై చర్యలకు దిగడానికి ప్రభుత్వాలు భయపడేలా. ఎందుకంటే, ఒకవేళ నిజంగా అవినీతి లేదా అక్రమాలు చేశారని స్పష్టమైన ఆధారాలతో అరెస్ట్ చేసినా.. తరువాతి ఎన్నికల్లో ఎక్కడ తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయో అని ప్రభుత్వాలు భయపడే పరిస్థితి వచ్చేసింది.
Indian Politics: రాజకీయంగా జైలుకు పంపించడం అనే ఆయుధం అవతలి పక్షాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఆయుధంగా రాజకీయ పక్షాలు వాడుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు అలాంటి చిల్లర పనులు చేసే ధైర్యం ఏ పార్టీకి.. నాయకునికి లేదు అని చెప్పవచ్చు. నేరాలతో మమేకమై పోయి.. కోటానుకోట్లు వెనకేసుకొని.. ఆ డబ్బుతో ఎన్నికల్లో ప్రచారాలు నిర్వహించి.. అందలం ఎక్కే ప్రయత్నం చేస్తున్న నాయకులకు మన దేశంలో కొదువలేదు. ప్రజలకు తెలిసినా.. జైలుకు వెళ్లాడనే సానుభూతి ముందు అవినీతి కంపు మరుగున పడిపోతుండడమే విషాదం. అధికారంలోకి వస్తే పాత కేసులు సహజంగానే అటకెక్కుతాయి. ఐదేళ్ల పాటు కోర్టుకు కూడా వెళ్లాల్సిన పనిలేకుండా కేసులను వాయిదాలు వేయించుకుంటూ కాలక్షేపం చేయవచ్చు.
ఇది రాజకీయనాయకుల గేమ్ గా మారిపోయింది. ప్రజల సానుభూతిని బలమైన ఆయుధంగా మలచుకుంటున్న నాయకులు ఇప్పుడు తమను జైలుకు పంపిస్తే చాలు అనుకుంటూ.. అందుకోసం ఎదురు చూస్తూ.. అధికార పక్షాన్ని కవ్విస్తూ.. వ్యవస్తలను చేష్టలుడిగేలా చేస్తున్నారు ఆధునిక ప్రజా నాయకులు. దీనికి ప్రస్తుతానికైతే పుల్ స్టాప్ కనిపించడం లేదనడంలో డౌటే లేదు. ఎందుకంటే, జార్ఖండ్ ఎన్నికలు చాలా విస్పష్టంగా సానుభూతికి పట్టం కట్టడం మన కళ్ళముందే కనిపిస్తోంది.