Hyderabad: తెలంగాణ అసెంబ్లీలో సోమవారం కీలక తీర్మానాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను చేపట్టాలని నిర్ణయించడంతో పాటు, దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం పంపించింది.
అదే సమయంలో, ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించిన తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అమలు చేస్తాం. కోర్టు తీర్పు వచ్చిన రోజే నేను సభలో ప్రకటన చేశాను” అని పేర్కొన్నారు.
మంత్రి దామోదర మాట్లాడుతూ, “30-40 ఏళ్ల కల నేడు సాకారం అవుతోంది. 30 ఏళ్లుగా సాగిన ఉద్యమానికి ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఎస్సీ వర్గీకరణ వల్ల కొంతమందికి భయం, అభద్రతాభావం కలుగుతోంది. కానీ, ఇది ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవరికి ఎటువంటి నష్టం కలగదు” అని స్పష్టం చేశారు.