Road Accident: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీజాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారి పై రంగాపూర్ సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ విషాద ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన వారంతా ఓ వివాహ రిసెప్షన్‌లో పాల్గొనడానికి సోమవారం రాత్రి పరిగికి వెళ్లారు. వేడుక అనంతరం స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, బస్సు రోడ్డుపై నిలిపిన లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం తీవ్రతతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా ముగ్గురు పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించేలోగా మరణించారు. క్షతగాత్రుల్లో కొందరికి పక్కలు విరిగినట్లు, కొందరికి తలపై తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని అత్యవసరంగా హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: Crime News: అనాథను తెచ్చుకొని అమ్మలా పెంచిది.. ఆ కనుపాపే ఆ అమ్మను కాటేసింది!
మృతులను చెన్వెళ్లికి చెందిన బాలమణి, హేమలత, మల్లేశ్ మరియు సందీప్‌లుగా గుర్తించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసి వెంటనే ఆసుపత్రులకు తరలించారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ యధావిధిగా వాహనాన్ని రోడ్డుపై ఆపాడని, ఎటువంటి హెచ్చరికా సూచనలు ఇవ్వలేదని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.