Hyderabad: హైదరాబాద్ నగరంలో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు కావడం సంచలనం సృష్టించింది. సరూర్‌నగర్ డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకానంద ఆస్పత్రిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడులు జరుపుతున్నట్లు వైద్యాధికారులు, పోలీసుల విచారణలో వెల్లడైంది.
కిడ్నీ మార్పిడి జరుగుతోందని సమాచారం అందుకున్న ఎల్‌బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఎంహెచ్‌వో గీతా, సరూర్‌నగర్ పీహెచ్‌సీ వైద్యురాలు అర్చన, జీహెచ్ఎంసీ అధికారులు, సరూర్‌నగర్ పోలీసులు కలిసి ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం నలుగురు రోగులను అధికారులు ప్రశ్నించారు.
వీరిలో ఇద్దరు కిడ్నీలు దానం చేసినట్లు, మరొ ఇద్దరికి ఆ కిడ్నీలను అమర్చినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నలుగురిలో ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు కాగా, మరొ ఇద్దరు తమిళనాడుకు చెందినవారని తేల్చారు. వీరిని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ఈ ఆసుపత్రిలో గత కొంతకాలంగా అమాయకులను వంచించి కిడ్నీ రాకెట్ దందా కొనసాగుతున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై పోలీసుల అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.