Viral News

Ganesh Immersion: గణేష్ నిమజ్జనంలో కొండచిలువతో డాన్స్.. వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు!

Ganesh Immersion: హైదరాబాద్ నగరంలో జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో సజీవంగా ఉన్న కొండచిలువతో డాన్స్ చేస్తూ హల్‌చల్ చేసిన వైజాగ్ డ్యాన్స్ బృందాన్ని మధురానగర్ పోలీసులు, గ్రేటర్ హైదరాబాద్ సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (GHSPCA) అధికారులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. జనాన్ని ఆకర్షించేందుకు బహిరంగంగా భారీ కొండచిలువను మెడలో వేసుకుని స్టెప్పులేసిన దృశ్యాలు వైరల్ కావడంతో అధికారులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నిందితులను పట్టుకున్నారు.

ఐదు రోజుల నిఘా – ఎట్టకేలకు చిక్కిన ముఠా..

సెప్టెంబర్ 19న కొండాపూర్‌లో జరిగిన నిమజ్జనంలోనే ఈ బృందాన్ని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించగా, పామును పట్టుకున్న వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం గత ఐదు రోజులుగా ఈ గ్రూప్ కదలికలను నిరంతరం ట్రాక్ చేసిన జీహెచ్‌ఎస్‌పీసీఏ ప్రతినిధులు, సెప్టెంబర్ 20న మధురానగర్ నిమజ్జనంలో ప్రదర్శన ఇవ్వడాన్ని గుర్తించి స్థానిక పోలీసుల సాయంతో జవహర్‌నగర్ వద్ద బృందాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.

కొండచిలువతో పాటు కోడి రెస్క్యూ – ఇన్ఫెక్షన్‌తో అల్లాడుతున్న వన్యప్రాణి..

డ్యాన్స్ గ్రూప్ నుంచి జీవించి ఉన్న భారీ కొండచిలువ (ఇండియన్ రాక్ పైథాన్)తో పాటు ఒక నాటు కోడిని అధికారులు సురక్షితంగా రక్షించారు. కొండచిలువను పశువైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షించగా, దానికి తీవ్రమైన నోటి ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. సరైన ఆహారం, సంరక్షణ లేక మూగజీవాన్ని వేదనకు గురిచేస్తూ డాన్సుల కోసం వాడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం దానికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు..

వన్యప్రాణులను చట్టవిరుద్ధంగా బంధించి, బహిరంగ ప్రదర్శనలకు ఉపయోగించినందుకు గాను నిర్వాహకులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం (Wildlife Protection Act), జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగలు, వేడుకల ముసుగులో వన్యప్రాణులను హింసిస్తూ ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *