Food Safety Inspection: హైదరాబాద్ నగరంలోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బడా బ్రాండ్లు, స్టార్ హోటళ్లుగా చలామణి అవుతున్న పలు పేరుగాంచిన రెస్టారెంట్లలో కనీస పరిశుభ్రత కరువై, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న చేదు నిజాలు వరుసగా బయటపడుతున్నాయి. తాజాగా కొండాపూర్‌లోని పాలమూరు గ్రిల్, హైటెక్ సిటీలోని మెహెఫిల్ రెస్టారెంట్, రాయదుర్గంలోని షా గౌస్, గచ్చిబౌలిలోని నవాబ్ రెస్టారెంట్, ఖాజాగూడలోని ఇగురు రెస్టారెంట్‌తో పాటు ప్రముఖ ఫుడ్ జాయింట్ రామేశ్వరం కేఫ్‌లలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి తీవ్ర లోపాలను గుర్తించారు.
ముఖ్యంగా ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీలోని ‘మెహెఫిల్ రెస్టారెంట్’ కిచెన్ నిర్వహణ చూసి అధికారులు సైతం విస్తుపోయారు. అక్కడ వంట గదులు ఎంత డర్టీగా, అపరిశుభ్రంగా ఉన్నాయంటే సామాన్యులు చూస్తేనే వాంతులు చేసుకునేంత అధ్వానంగా ఉన్నాయి. కిచెన్ సీలింగ్‌లు, గోడలు, లైట్లపై జిడ్డు, గ్రీజు, దట్టమైన దుమ్ము పేరుకుపోయాయి. వంటలు చేసే ఏరియాలోనే ఓపెన్ డ్రైనేజీలు ఉండటం, ఆహార వ్యర్థాలను అక్కడే పడేయడం వల్ల ఈగలు ముసురుతున్నాయి. పలు రెస్టారెంట్ల కిచెన్లలో ఎలుకలు, బల్లులు స్వేచ్ఛగా సంచరిస్తున్నట్లు అధికారులు లైవ్‌గా గుర్తించారు. ఇంతటి దుస్థితిలోనూ చికెన్, మటన్ బిర్యానీలను కస్టమర్లను ఆకర్షించేందుకు హానికరమైన కెమికల్ ఫుడ్ కలర్స్ కలుపుతూ వండుతున్నారు. అన్నింటికంటే ఘోరంగా, కిచెన్ సిబ్బంది నోట్లో గుట్కాలు నములుతూ వంటలు చేస్తున్న వైనంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే రెండు మూడు రోజుల క్రితం వండి మిగిలిపోయిన కుళ్లిన బిర్యానీలు, కూరలను ఫ్రీజర్లలో కుక్కి.. కస్టమర్లు ఆర్డర్ ఇవ్వగానే వాటిని మళ్లీ వేడి చేసి రంగులు అద్ది వడ్డిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. గడువు ముగిసిన (ఎక్స్పైరీ అయిన) ఫుడ్ ప్రొడక్ట్స్, ప్యాకింగ్ డేట్ లేని లేబుల్ లేని మసాలా దినుసులను అధికారులు భారీగా స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అయితే, ఇంతటి ఘోరాలు వెలుగుచూస్తున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కేవలం ఫైన్లు వేసి, నోటీసులు ఇచ్చి వదిలేస్తుండటంతో రెస్టారెంట్ల నిర్వాహకులకు భయం లేకుండా పోయింది. నోటీసులు అందుకున్న కొన్నిరోజుల వరకే పరిశుభ్రంగా ఉంచుకోవడం తర్వాత మళ్ళి అధికారులు రారు అనే నమ్మకంతో యథావిధిగా పాత పద్ధతిలోనే అపరిశుభ్ర వాతావరణంలో వండడం.. అవే మళ్ళి కస్టమర్స్ కి పెట్టడం జరుగుతుంది.
