Chilzo: మన ఇంట్లో ఎన్ని రకాల పంచభక్ష్య పరమాన్నాలు వండుకున్నప్పటికీ, పొరుగు ఇంట్లో వండిన పుల్లకూర చాలా రుచిగా అనిపిస్తుందనే సామెత మనకు తెలిసిందే. ఈ సూత్రాన్ని గ్లోబల్ లెవెల్‌లో అన్వయిస్తే.. మన దేశంలో ఎన్నో అద్భుతమైన సాంప్రదాయ వంటకాలు ఉన్నప్పటికీ, విదేశీ రుచుల వైపు మన నాలుక మొగ్గు చూపుతుంది. ప్రపంచీకరణ (Globalization) పుణ్యమా అని విభిన్న దేశాల తిండి మన రోజువారి జీవితంలో భాగమైపోయింది. రెండు దశాబ్దాల క్రితం కేవలం హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలకే పరిమితమైన చైనీస్ నూడుల్స్, నేడు ప్రతి గల్లీలోనూ సాయంత్రపు స్నాక్ గా మారిపోయాయి. దీనికి తోడు యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్లు సరికొత్త అంతర్జాతీయ వంటకాలను మన డిజిటల్ స్క్రీన్లపై పరిచయం చేస్తూ మనలో క్రేవింగ్స్ పెంచుతున్నారు. సరిగ్గా భారతీయులకు ఉన్న ఈ ‘విదేశీ రుచుల యావ’ను ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియాగా మార్చుకున్నారు ముంబైకి చెందిన తల్లీకూతుళ్లు.
సాధారణంగా చైనా లేదా ఇటలీ వంటకాలు తినాలనిపిస్తే ఆయా దేశాలకు వెళ్లాల్సిన పనిలేకుండా, ముంబై బేస్డ్ స్టార్టప్ “చిల్జో” (Chilzo) ద్వారా విదేశీ ఫ్లేవర్లను భారతీయుల వంటగదుల్లోకి తీసుకొచ్చారు. 2022లో తల్లి హేమ శర్మ, ఆమె కూతుళ్లు దేవా (దియా), ఓజస్వి శర్మ కలిసి ఈ సరికొత్త ఫుడ్ బ్రాండ్‌ను స్థాపించారు. మొరాకన్ వంటకాలకు చెందిన ఘాటైన ‘హరిస్సా’, చైనీస్ ‘చిల్లీ ఆయిల్’, ‘షెజ్వాన్ సాస్’, ఇటలీకి చెందిన సాంప్రదాయ ‘మరినారా’, ‘అరబ్బియాటా పాస్తా సాస్’ వంటి ప్రామాణిక సాస్‌లు ఇంకా కండిమెంట్స్‌ను (Condiments) ఈ బ్రాండ్ అందిస్తోంది. ఎటువంటి బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా, కేవలం పాకశాస్త్రంపై ఉన్న ఇష్టంతో లక్షల టర్నోవర్ సాధిస్తూ ఈ ముగ్గురు మహిళలు నేడు విజయవంతమైన వ్యాపారవేత్తలుగా దూసుకుపోతున్నారు.
లాక్‌డౌన్ ప్రయోగాలు.. బిజినెస్ ఐడియాగా..
ఈ సక్సెస్ జర్నీ వెనుక అమెరికాలో దేవాకు లభించిన అంతర్జాతీయ అనుభవం ఉంది. డ్రెక్సెల్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన దేవా, ఫిలడెల్ఫియాలోని ఒక మార్కెటింగ్ సంస్థలో పనిచేసేటప్పుడు విభిన్న దేశాలు పర్యటించింది. ఆయా ప్రాంతాల్లో కేవలం ఆహారాన్ని రుచి చూడటమే కాకుండా, అక్కడి సాంప్రదాయ చెఫ్‌లను కలిసి ఆయా వంటకాల తయారీ విధానాన్ని, రహస్యాలను ఒక డైరీలో జాగ్రత్తగా నోట్ చేసుకునేది. 2019 మార్చిలో కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇండియాకు తిరిగి వచ్చిన దేవా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంట్లోనే ఉండిపోయింది. లాక్‌డౌన్ టైమ్‌లో రోజువారీ దాల్-రోటీ తిని బోర్ కొట్టడంతో, తను డైరీలో రాసుకున్న విదేశీ వంటకాలపై తల్లి, సోదరితో కలిసి కిచెన్‌లో ప్రయోగాలు మొదలుపెట్టింది.
బీటెక్ గ్రాడ్యుయేట్ అయిన 24 ఏళ్ల చిన్న కూతురు ఓజస్వి పర్ఫెక్ట్ రెసిపీల తయారీ బాధ్యత తీసుకోగా, దేవా వాటి టేస్ట్ ఫైనల్ చేసేది. పక్కా ఇటాలియన్ పద్ధతిలో పాస్తా సాస్‌లు చేయడం కోసం దాదాపు 15 సార్లు ఫెయిల్ అయినప్పటికీ, యూట్యూబ్ ఇంకా తల్లి సహాయంతో వారు పట్టుదలతో సరైన ఫ్లేవర్లను సాధించారు. అలా తాము తయారు చేసిన ఆఫ్రికన్, ఇటాలియన్, చైనీస్ రుచుల సాస్‌లను దాదాపు 200 శాంపిల్స్ రూపంలో స్నేహితులకు, పొరుగువారికి పంపిణీ చేశారు. వారి నుండి అద్భుతమైన సానుకూల స్పందన రావడంతో, తమ సొంత పొదుపు మొత్తం నుండి రూ.40 లక్షల పెట్టుబడితో ‘చిల్జో’ ప్రాజెక్టును పట్టాలెక్కించారు.
సవాళ్లను దాటి సక్సెస్ వైపు..
2022లో ముంబైలో అఫీషియల్ యూనిట్ ప్రారంభించిన తర్వాత దేవా తన మార్కెటింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఫుడ్ ఇండస్ట్రీపై ముందే అవగాహన లేకపోవడంతో ప్రారంభంలో ప్రాఫిట్ మార్జిన్స్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్ట్ షెల్ఫ్ లైఫ్ (నిల్వ కాలం), మరియు జార్లను సీల్ చేయడం వంటి సాంకేతిక విషయాలలో కష్టాలు ఎదురయ్యాయి. కానీ మెంటార్ల సహాయంతో, వివిధ ఫుడ్ ఈవెంట్లలో పాల్గొంటూ వ్యాపార సూత్రాలను నేర్చుకున్నారు. హోటల్/ఫుడ్ బిజినెస్‌లో మనుషుల అవసరం ఎక్కువ కాబట్టి, తమ యూనిట్‌లో 30 మంది కార్మికులకు ఉపాధి కల్పించారు. తమ ఉత్పత్తులను రూ.129 నుండి రూ.300 ధరల శ్రేణిలో ఉంచి.. బిగ్‌బాస్కెట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చారు.
నిజాయితీయే బ్రాండ్ వాల్యూ..
మార్కెట్లో ఉన్న ఇతర పెద్ద కంపెనీలు నీళ్లు, చక్కెర మరియు ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలిపి సాస్‌లను తయారు చేస్తుంటే, ‘చిల్జో’ మాత్రం ఒరిజినల్ రెసిపీలను అత్యంత నిజాయితీగా అనుసరిస్తోంది. ఉదాహరణకు, ఇటాలియన్ చెఫ్‌లు చేసే విధంగానే టమాటాలను 8 గంటల పాటు నెమ్మదిగా వండి, హెర్బ్స్ మరియు ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో కలిపి సహజసిద్ధంగా సాస్ తయారు చేస్తారు. అందుకే వీరి సాస్‌లు డయాబెటిక్ ఫ్రెండ్లీ (చక్కెర లేనివి) గా గుర్తింపు పొందాయి. వీరి ‘షెజ్వాన్ సాస్’ కోసం సిచువాన్ పెప్పర్‌కార్న్స్, ‘జెనోవా పెస్టో’ కోసం పైన్ నట్స్, పార్మెసాన్ చీజ్ వంటి ప్రీమియం పదార్థాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుని మరీ వాడుతున్నారు. ఈ క్వాలిటీ వల్లే ప్రస్తుతం చిల్జో బ్రాండ్ నెలకు 7 వేల మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లకు సేవలు అందిస్తూ, మార్కెట్లో విదేశీ రుచుల నమ్మకమైన కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.
