Amaravati: ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతల రాజధాని పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు ఇంకా ఘర్షణల వ్యవహారంపై తాడేపల్లి పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మొత్తం మూడు విడివిడి కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెనుమాక ప్రాంతానికి చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. మరోవైపు, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారిని దురుసుగా నెట్టేసినందుకు గానూ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చట్టపరమైన చర్యలకు పూనుకున్నారు. తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు స్వయంగా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అంబటి రాంబాబుపై పోలీస్ యాక్ట్ 30 కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే ఘర్షణలో తమ కారు అద్దాలు పగలగొట్టారంటూ వైఎస్సార్‌సీపీ నేత నారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. రాళ్లదాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ రాజధాని ఘర్షణల వెనుక పక్కా ప్లాన్ ఉందనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వైఎస్సార్‌సీపీ నేతల పర్యటనలో పలువురు రౌడీషీటర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన పాత బ్యాచ్ సభ్యులే ఈ పర్యటనలోనూ ఉన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి. అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేయడం వెనుక కూడా ఆ రౌడీషీటర్ల హస్తమే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక రైతులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే సదరు బ్యాచ్ తొలుత రాళ్లదాడికి దిగిందా అనే యాంగిల్‌లో దర్యాప్తు సాగుతోంది. గతంలో టీడీపీ ఆఫీస్ దాడి కేసులో నిందితుడిగా ఉన్న చైతన్య అనే వ్యక్తి, ఈ ఘర్షణ సమయంలో వైఎస్సార్‌సీపీ నేతల వెంటే ఉన్నట్లు పోలీసులు సీసీటీవీ విజువల్స్ ఆధారంగా గుర్తించడం గమనార్హం.
