Adulterated Paneer

Adulterated Paneer: 825 కిలోల కల్తీ పనీర్ సీజ్.. గంజిపొడి, సింథటిక్ పాలతో దందా!

Adulterated Paneer: భాగ్యనగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మూఠాలపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. నగరవ్యాప్తంగా సాగిన ఒక భారీ జాయింట్ ఆపరేషన్‌లో కల్తీ పనీర్ (Adulterated Paneer) తయారీ కేంద్రాల గుట్టురట్టయింది. నమ్మకమైన వ్యక్తుల నుంచి వచ్చిన పక్కా సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉమ్మడిగా నగరంలోని 45 ప్రముఖ ఫుడ్ ఔట్ లెట్లతో పాటు, 8 పనీర్ తయారీ యూనిట్లలో ఏకకాలంలో మెరుపు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

825 కిలోల కల్తీ పనీర్ స్వాధీనం:

ఈ దాడుల్లో భాగంగా అధికారులు సుమారు 825 కిలోల కల్తీ పనీర్‌ను ల్యాబ్‌లకు పంపించి సీజ్ చేశారు. వీటితో పాటు నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేసేందుకు ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచిన భారీ మొత్తంలో నకిలీ చీజ్, ఇతర నాసిరకం తినుబండారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కనీస అనుమతులు గానీ, ఫుడ్ లైసెన్సులు (FSSAI) గానీ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఈ నకిలీ యూనిట్లను నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

పాల బదులు ‘రసాయనాలు.. గంజిపొడి’:

కల్తీ పనీర్ తయారీ కేంద్రాల్లో తనిఖీ చేసిన అధికారులకు అక్కడ ఉన్న పరిస్థితులు చూసి షాక్‌కు గురయ్యారు.

  • సింథటిక్ పాలు: నాణ్యమైన పశువుల పాలకు బదులుగా రసాయనాలతో కూడిన సింథటిక్ పాలు, నాసిరకం పౌడర్లను ఉపయోగించి ఈ కేంద్రాల్లో పనీర్ తయారు చేస్తున్నారు.

  • స్టార్చ్ మరియు నాన్-మిల్క్ ఫ్యాట్స్: పనీర్ బరువును కృత్రిమంగా పెంచడానికి, అది గట్టిగా ముక్కలుగా రావడానికి స్టార్చ్ (గంజిపొడి), మితిమీరిన నీరు, ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే నాన్-మిల్క్ ఫ్యాట్స్ (జంతువుల కొవ్వు లేదా వనస్పతి) కలిపి ఈ దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నట్లు అధికారులు ఆధారాలతో సహా కనుగొన్నారు.

  • వైద్యుల హెచ్చరిక – ప్రాణాలకే ముప్పు: ఇలాంటి సింథటిక్ పాలు, గంజిపొడి, జంతువుల కొవ్వుతో చేసిన కల్తీ పనీర్, నకిలీ చీజ్ పదార్థాలను రెగ్యులర్‌గా తినడం వల్ల ప్రజలు తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యలు, లివర్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ వ్యాధులు మరియు దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యాపారులపై కేసులు నమోదు – తనిఖీలు నిరంతరం:

ఎలాంటి లైసెన్స్ లేకుండా, అక్రమంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ కల్తీ పనీర్ తయారు చేస్తున్న వ్యాపారులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని, ఇలాంటి నకిలీ తయారీ కేంద్రాలు, నాసిరకం హోటళ్లపై తనిఖీలు మున్ముందు కూడా నిరంతరం కొనసాగుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *