Kerala: కేరళలోని త్రిసూర్ రైల్వే స్టేషన్‌లో ఈరోజు ఉదయం పెను ప్రమాదం సంభవించింది. స్టేషన్ ఆవరణలోని పెయిడ్ పార్కింగ్ షెడ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ పార్క్ చేసి ఉన్న వందలాది ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులు తమ వాహనాలను సురక్షితంగా ఉంటాయని పార్కింగ్‌లో పెట్టి వెళ్తే, తిరిగి వచ్చేసరికి అవి కాలి బూడిదవ్వడం అందరినీ కలిచివేస్తోంది.
ఈ ప్రమాదం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు. పార్కింగ్ షెడ్ పైనుంచి వెళ్తున్న ఒక విద్యుత్ తీగ తెగి బైకులపై పడటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. విద్యుత్ తీగ పడటంతో వచ్చిన నిప్పురవ్వలు బైకుల్లోని పెట్రోల్‌కు అంటుకోవడంతో మంటలు క్షణాల్లో షెడ్ అంతటా వ్యాపించాయి. మంటల ధాటికి పార్కింగ్ పైన ఉన్న రేకుల షెడ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నది.
ప్రమాద సమయంలో అక్కడ దాదాపు 400 వరకు బైకులు ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ, అప్పటికే మెజారిటీ వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రస్తుతం రైల్వే అధికారులు, పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
