Delhi Airport

Delhi Airport: ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో అస్థిపంజరం కలకలం!

Delhi Airport: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. టెర్మినల్-3 వద్ద ప్రయాణికుల బ్యాగులను సాధారణ తనిఖీలు చేస్తున్న క్రమంలో భద్రతా సిబ్బందికి ఒక బ్యాగులో మానవ అస్థిపంజరం కనిపించడంతో అక్కడ కలకలం రేగింది. భారీ భద్రత ఉండే విమానాశ్రయంలో ఇలా అస్థిపంజరం బయటపడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయ భద్రతా సంస్థలతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా రంగంలోకి దిగి క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు.

పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆ బ్యాగ్ ఢిల్లీ నుంచి ప్రయాణిస్తున్న ఒక వైద్య విద్యార్థికి చెందినదిగా తేలింది. వైద్య విద్యార్థులు తమ చదువులో భాగంగా ప్రాక్టికల్స్ కోసం ఉపయోగించే డెమో అస్థిపంజరం (నమూనా) అది అని గుర్తించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధారణంగా మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల శిక్షణ కోసం ఇటువంటి నమూనాలను వాడుతుంటారు. ఆ బ్యాగుపై ఉన్న కంపెనీ లేబుల్ ఆధారంగా పోలీసులు ఆ సంస్థను సంప్రదించగా, అవి విద్యార్థుల కోసం తయారు చేసిన నమూనాలేనని వారు ధృవీకరించారు.

Also Read:  RS Praveen Kumar: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు సీపీ సజ్జనార్ నోటీసులు

ఈ ఘటనలో ఎటువంటి నేరపూరిత కోణం లేదని, అనుమానించాల్సిన పనిలేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా అది నిజంగానే విద్యా అవసరాల కోసం రూపొందించిన నమూనానా లేక మరేదైనా అనే విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఆ అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన కారణంగా విమానాశ్రయంలో కొంతసేపు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *