Himachal Pradesh High Court: పెళ్లయిన ఆడపిల్లలకు కన్న తండ్రి ఆస్తిలో హక్కు ఉండదంటూ అధికారులు చెప్పే సాకులకు హైకోర్టు గట్టి చెంపపెట్టు ఇచ్చింది. పెళ్లి అయినంత మాత్రాన పుట్టింటితో సంబంధాలు తెగిపోవని, కన్నతండ్రి వారసత్వ ఆస్తిని పొందే చట్టబద్ధమైన హక్కును ఏ వివాహిత కుమార్తె కోల్పోదని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఒకే కుటుంబంలో మూడు తరాలుగా, ఏకంగా 50 ఏళ్లకు పైగా నానుతున్న ఓ వ్యవసాయ భూమి వివాదంలో కుమార్తెకు సంపూర్ణ న్యాయం చేస్తూ.. రెండు నెలల్లోగా ఆమె పేరిట భూమి పట్టా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
అసలేం జరిగింది? – 50 ఏళ్ల నాటి నేపథ్యం..
హిమాచల్ ప్రదేశ్ షిమ్లా జిల్లా చోపాల్ తహసీల్‌లోని సుమారు 3 బిగాల ప్రభుత్వ బంజరు భూమిని సాగు నిమిత్తం మీనా రామ్ అనే స్థానిక రైతుకు 1972లో ‘నౌటోర్ రూల్స్’ (Nautor Rules) కింద ప్రభుత్వం మంజూరు చేసింది. మీనా రామ్ ఆ భూమిని కొన్నేళ్లపాటు సాగు చేశారు. అయితే అధికారికంగా భూమి ‘పట్టా’ పత్రాలపై రెవెన్యూ అధికారులు సంతకాలు చేయకముందే ఆయన 1990లో కన్నుమూశారు.
తల్లి పోరాటం – 2012లో మరణం..
భర్త మరణానంతరం ఆయన భార్య ఆ పట్టా కోసం దరఖాస్తు చేసుకుంది. అన్ని కాగితాలు సిద్ధమైనప్పటికీ అధికారులు సంతకాలు చేయకుండా ఏళ్ల తరబడి జాప్యం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఆ భూమినే నమ్ముకుని సాగు చేస్తున్న ఆమె కూడా చివరకు 2012లో పట్టా చేతికి రాకుండానే ప్రాణాలు విడిచారు.
కుమార్తె సాగు – పట్టా కోసం దరఖాస్తు..
తల్లిదండ్రుల మరణం తర్వాత వారి ఏకైక చట్టబద్ధమైన వారసురాలైన కుమార్తె ఆ భూమిని నిరంతరాయంగా సాగు చేసుకుంటూ వచ్చింది. చివరకు 2023లో తన పేరు మీద పట్టా ఇవ్వాలని షిమ్లా డిప్యూటీ కమిషనర్‌ను ఆశ్రయించింది.
అధికారి తిరస్కరణ – వివాదానికి కారణమైన 1980 సర్క్యులర్..
ఈ దరఖాస్తును పరిశీలించిన సబ్ డివిజనల్ ఆఫీసర్ (SDO).. కుమార్తెకు అనుకూలంగా రికార్డులు ఉన్నాయని, పట్టా ఇవ్వవచ్చని సిఫార్సు చేశారు. కానీ 2024 జనవరిలో అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (ADM) ఆమె దరఖాస్తును నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు.
1980 నాటి ఒక పాత ప్రభుత్వ పరిపాలనా సర్క్యులర్ ప్రకారం.. ఒరిజినల్ దరఖాస్తుదారు పట్టా రాకముందే చనిపోతే, అతడి చట్టపరమైన వారసుల్లో ‘పెళ్లయిన కుమార్తెలు’ ఉంటే వారికి భూమి కేటాయించరాదని, ఇతర అర్హులైన వారసులకే ఇవ్వాలని అధికారులు వాదించారు.
తాను ప్రభుత్వ పథకం కింద కొత్తగా భూమి అడగడం లేదని, తల్లిదండ్రులకు క్లాస్-1 చట్టబద్ధమైన ఏకైక వారసురాలిగా వారి ఆస్తిని పొందే హక్కు తనకు ఉందని, పెళ్లయిందన్న ఒకే ఒక్క కారణంతో తన హక్కును కాలరాయడం అన్యాయమని సవాలు చేస్తూ ఆమె హైకోర్టు తలుపు తట్టింది.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు & స్పష్టత..
ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణ జరిపిన హైకోర్టు బెంచ్.. అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది.
-
నియమాల్లో లేని ఆంక్షలు:హిమాచల్ ప్రదేశ్ నౌటోర్ భూ చట్టాల్లోని రూల్ 8 ప్రకారం.. తండ్రి జీవించి ఉన్నప్పుడు మాత్రమే ఆయనపై ఆధారపడిన పిల్లలు కొత్త భూమి కోసం దరఖాస్తు చేయకూడదు. తండ్రి మరణించిన తర్వాత, ఇప్పటికే మంజూరైన భూమిని వారసత్వంగా పొందేందుకు పెళ్లయిన కుమార్తెకు ఎలాంటి చట్టపరమైన అడ్డంకి లేదు.
-
సర్క్యులర్ చట్టం కంటే పెద్దది కాదు:1980 నాటి పరిపాలనా సర్క్యులర్ కేవలం ఒక అంతర్గత వివరణ మాత్రమేనని, అది రాజ్యాంగబద్ధమైన లేదా చట్టబద్ధమైన హక్కులను రద్దు చేయలేదని స్పష్టం చేసింది.
-
హిందూ వారసత్వ చట్టం సమాన హక్కులిచ్చింది:హిందూ వారసత్వ చట్టం (Hindu Succession Act) ప్రకారం కొడుకులతో సమానంగా వివాహిత కుమార్తెలకు కూడా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా హక్కు ఉందని కోర్టు గుర్తుచేసింది.
-
కాలం చెల్లిన ఆలోచన విధానం:సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన కీలక తీర్పును ఉటంకిస్తూ.. “వివాహం కాగానే ఆడపిల్ల పుట్టింటితో సంబంధాలు తెంచుకుంటుందని భావించడం రాజ్యాంగ విరుద్ధమైన, కాలం చెల్లిన భావజాలం” అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
హైకోర్టు తుది ఆదేశాలు..
బాధితురాలు దశాబ్దాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటున్న విషయాన్ని, భూమి ఆమె ఆధీనంలోనే ఉందన్న సత్యాన్ని ప్రభుత్వం సైతం కాదనలేకపోయిందని కోర్టు పేర్కొంది.
దీంతో 2024లో అధికారులు ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. 2023లో ఆమె సమర్పించిన దరఖాస్తును పునఃపరిశీలించి, ఇతర అర్హతలు సరిపోలితే.. ఈ తీర్పు వెలువడిన రెండు నెలల్లోగా ఆమె పేరు మీద శాంక్షన్ ఆర్డర్ ఇచ్చి అధికారిక పట్టా జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
