Film Chamber: హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వేదికగా గురువారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయ్స్ ఫెడరేషన్ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత అనూహ్యంగా దూసుకొచ్చారు. తనను సమావేశానికి రానివ్వకుండా అడ్డుకోవడమేంటని ఫెడరేషన్ ముఖ్య నేతలను నిలదీస్తూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం ఛాంబర్ బయటే కూర్చొని బైఠాయించి ఆందోళనకు దిగడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
అధ్యక్షురాలినైన నన్నే ఆపుతారా? – సుమలత ఫైర్..
మరోవైపు సుమలత వర్గానికి, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ వర్గానికి మధ్య అంతర్గత వివాదాలు తీవ్రమయ్యాయి. యూనియన్ వ్యవహారాల్లో తనను అసభ్య పదజాలంతో దూషించారంటూ సుమలత ఇప్పటికే రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో రఘు మాస్టర్ వర్గంపై ఫిర్యాదు కూడా చేశారు. పోలీస్ కేసులు, బహిరంగ ఆరోపణలతో రచ్చకెక్కిన డ్యాన్సర్స్ యూనియన్ గొడవ.. ఇప్పుడు ఫెడరేషన్ సమావేశంలోకి సుమలత దూసుకురావడంతో మరింత ముదిరి టాలీవుడ్‌లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.
