తెలుగురాష్ట్రాలను కొద్దిరోజుల క్రితం భారీ వర్షాలు అతలాకుతలం చేసిన విషయం ఇంకా ఎవరూ మర్చిపోలేరు. భారీ వర్షాలతో.. వరదలు వచ్చి రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు అష్టకష్టాలూ పడ్డారు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు తెలుగు ప్రజలను నానా అవస్థలు పెట్టాయి. వాగులు వరదనీటితో పోటెత్తాయి. కృష్ణా.. గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు తీవ్రగా నష్టపోయాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు ౧౦ వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దాదాపు ౩౩ మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్దీ రోజులుగా వాతావరణం పొడిగా మారింది. వర్షం జాడ కనిపించలేదు. దీంతో ఇప్పుడిప్పుడే ఈ విపత్తు తెచ్చిన ఇబ్బందుల నుంచి ప్రజలు తేరుకుంటున్నారు.
అయితే, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ మరోసారి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈరోజు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం హైదరాబాద్ సహా ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తెలిక పాటి వర్షాలు పడవచ్చు. ఆంధ్రప్రదేశ్, యానాంలో లోవర్ ట్రోపో ఎన్క్లోసర్ కారణంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. పగలు ఎండ ఎక్కువగానే ఉంటుందనీ.. అయితే, సాయంత్రానికి వర్షం కురుస్తుందనీ చెబుతున్నారు.
ఇక సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజ్నన సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో 21న అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఆ సమయంలో బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉండొచ్చని చెప్పారు.
దంచికొడుతున్న ఎండలు..
భారీ వర్షాలు ముగిసిన తరువాత క్రమేపీ తెలంగాణలో వాతావరణం వేడెక్కుతోంది. గత రెండురోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు పెరిగిపోయాయి. వేడి వాతావరణానికి తోడుగా ఉక్కపోత తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.