Heatwave Alert

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. రికార్డ్ స్థాయిలో ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన ఎండలు ఈసారి ఏప్రిల్‌లోనే జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణ విషయానికి వస్తే, రాజధాని హైదరాబాద్‌తో సహా చాలా జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే వరంగల్, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న దానికంటే ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఖమ్మం, వనపర్తి వంటి జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 275 మండలాల్లో ఎండలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. గురు, శుక్రవారాల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కడప, కర్నూలు జిల్లాల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని అంచనా. ఈ జిల్లాల్లో గరిష్టంగా 43 నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది.

ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. వడదెబ్బ తగలకుండా తగినన్ని మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *