Motivational Quotes: ఈరోజుల్లో ప్రతి మనిషి కొన్ని క్షణాల కంటే ఎక్కువగా మోటివేషన్‌తో ఉండలేకపోతున్నాడు. అలా ఉండగలిగేవారు మాత్రం జీవితంలో ఎదుగుతూ ప్రపంచాన్ని జయిస్తున్నారు. మనలో చాలామంది ఏదైనా మోటివేషనల్ కొటేషన్ చూసినప్పుడు మాత్రం ఏదో చేయాలని అనుకుంటారు, కానీ అది కొంతసేపు మాత్రమే ఉంటుంది. అలాంటి వారికోసమే ఇప్పుడు ఇక్కడ కొన్ని మోటివేషనల్ ఇమేజెస్ చూద్దాం. కావాలంటే వీటిని మొబైల్ వాల్‌పేపర్‌లుగా పెట్టుకొని, అవసరమైన ప్రతిసారీ వాటిని చూసి మోటివేట్ అవ్వొచ్చు.

నువ్వు చేసే పనికి, నీ పరధ్యానానికి మధ్య రోజూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అంటే ఒక పని చేస్తూనే ఉంటావు కానీ, మనసు మరియు ఆలోచనలు ఇంకో చోట ఉంటాయి. చేస్తున్న పని మీద ధ్యాస ఉంచకపోవడమే అసలు సమస్య. ఎలాగైనా ఈరోజు సాయంత్రం వాకింగ్‌కు వెళ్లాలి అనుకుంటావు, కానీ వెళ్లాల్సిన సమయం వచ్చేసరికి “ఈరోజు కాదు రేపు” లేదా “ఇంకొంత సమయం తర్వాత” అంటూ నీకు నువ్వే చెప్పుకుంటావు. ఇలా చేయడం వల్ల నిన్ను నువ్వు ఇంకా వెనక్కి నెట్టేస్తున్నావని అర్థం. నిన్ను వెనక్కి లాగేది కేవలం నీ బద్ధకం మాత్రమే.

మా నాన్న ఒకసారి ఈ విషయం చెప్పారు.. నీకు 30 ఏళ్లు వచ్చిన తర్వాత నువ్వు చూడటానికి బాగున్నావా, బాగాలేవా అని ఎవరూ చూడరు. అందరూ చూసేది నీ దగ్గర డబ్బు ఉందా లేదా అనేదే! జీవితంలో సంపాదనపై దృష్టి పెట్టకుండా, కేవలం జిమ్‌కు వెళ్లడం, అప్పు చేసైనా ఖరీదైన బట్టలు కొనడం వంటి అనవసరమైన ఖర్చులు చేస్తూ, అకౌంట్లో డబ్బు లేకపోయినా పైకి “కాస్ట్లీ”గా కనిపించడంలో పెట్టే ధ్యాస ఏదో.. డబ్బు సంపాదించడంలో పెడితే, 30 ఏళ్ల తర్వాత ఇప్పటికంటే ఎక్కువ ప్రశాంతంగా బ్రతకొచ్చు.

24/7 గంటలు పనిచేయడం వల్ల ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకోదు. ఒకవేళ అంతగా గుర్తుపెట్టుకునేది ఎవరైనా ఉన్నారంటే అది నీ పిల్లలే. నువ్వు 24 గంటలు ఆఫీస్ పని అంటూ రాత్రిళ్లు ఆలస్యంగా రావడం, వచ్చిన తర్వాత పిల్లలతో సమయం కేటాయించకుండా “అలసిపోయాను” అంటూ నిద్రపోతే.. కొన్ని ఏళ్ల తర్వాత పిల్లలు నిన్ను దూరం పెట్టడం తప్ప ఇంకేం ఉండదు. సమయం మొత్తం పనికే కాకుండా ఫ్యామిలీకి కూడా కేటాయించడం ముఖ్యం. పని నుండి కొంత బ్రేక్ తీసుకొని ఫ్యామిలీని బయటకు తీసుకెళ్లాలి. దానికోసం నువ్వు పని మానుకోవాల్సిన అవసరం లేదు, సాయంత్రం కొంత సమయం ఇస్తే చాలు.

ఎలోన్ మస్క్ గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కావడమే కాకుండా, అమెరికా రాజకీయాలనే ప్రభావితం చేయగల ఏకైక వ్యక్తి ఆయన.
ఆయన ఒకప్పుడు ఒక విషయం చెప్పారు.. “నువ్వు నీ రూమ్‌ని క్లీన్ చేయడానికి 30 రోజులు కేటాయిస్తే, దానికి 30 రోజుల టైమ్ పడుతుంది. ఒకవేళ నువ్వు అదే రూమ్‌ని క్లీన్ చేయడానికి 3 గంటలు మాత్రమే సమయం ఇస్తే, అది 3 గంటల్లోనే పూర్తవుతుంది.” మీ లైఫ్ గోల్స్‌కి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. నువ్వు ఏదైనా సాధించాలని అనుకుని దానికి 10 ఏళ్ల సమయం ఇస్తే అది 10 ఏళ్లు పడుతుంది. అదే 6 నెలలు లేదా సంవత్సరం గడువు పెట్టుకుంటే, నీ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకపోయినా.. 10 ఏళ్లలో చేయాల్సిన పనిని ఒక్క సంవత్సరంలో చేస్తావు. తద్వారా వేరే వాళ్ళ కంటే నువ్వు చాలా ముందు ఉంటావు మరియు ఆ సంవత్సరంలో ఎంతో నేర్చుకుంటావు.
