Harish Rao

Harish Rao Advocate: ఫోన్ ట్యాపింగ్ తో హరీష్ రావు కి సంబంధం లేదు

Harish Rao Advocate: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల విచారణ ఎదుర్కొన్న మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి ఆయన తరపు న్యాయవాది రామచంద్రరావు కీలక విషయాలను వెల్లడించారు. ఈ కేసుతో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగంగానే జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని కావాలనే ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గతంలోనే హైకోర్టులో విచారణ జరిగిందని, అప్పుడే కోర్టు ఈ కేసును కొట్టివేసిందని (క్వాష్) ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ, అక్కడ కూడా చుక్కెదురైందని.. అసలు సంబంధం లేని వ్యక్తులను కేసుల్లోకి లాగవద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిందని న్యాయవాది తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్ కూడా దాఖలైందని, అందులో ఎక్కడా హరీష్ రావు పేరు ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Nagar Kurnool: నిందితుడిని వదిలేసి, బాధితులను బూతులు తిట్టిన ఎస్సై..

ప్రభుత్వ తీరును తప్పుపడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారిందని ఆయన విమర్శించారు. నిన్న రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి, కనీసం 12 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు ఉదయమే విచారణకు రావాలని కోరడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆరోపించారు. అయినప్పటికీ, తమ దగ్గర దాచడానికి ఏమీ లేదని, అందుకే కోర్టు నుంచి స్టే తీసుకోకుండా హరీష్ రావు నేరుగా విచారణకు హాజరయ్యారని తెలిపారు.

ఇక విచారణ సమయంలో నిబంధనల ప్రకారం అడ్వకేట్‌ను అనుమతించాల్సి ఉన్నా, పోలీసులు అందుకు నిరాకరించడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి న్యాయ సాయం పొందే హక్కు ఉంటుందని, కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తనను లోపలికి వెళ్లనివ్వలేదని న్యాయవాది పేర్కొన్నారు. కేవలం రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు, ప్రజా దృష్టిని మళ్లించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *