HARISH RAO: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, కేవలం డిక్లరేషన్ల పేరుతో నాటకాలు ఆడుతోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.
రైతుల కోసం ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఆగిపోయిందని, బీసీల కోసం చెప్పిన డిక్లరేషన్‌కు ఎటూ దిక్కు లేదని అన్నారు. ఇప్పుడు నల్లమల డిక్లరేషన్‌ను తెరమీదకు తీసుకొచ్చి మళ్లీ మభ్యపెడతున్నారని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడని, కేవలం పతాక ప్రదర్శనలతో కూడిన ఈ డిక్లరేషన్లన్నీ “పైన పటారం లోన లొటారం” లాంటి వాటేనంటూ సెటైర్ వేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను నల్లమల బిడ్డనంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ నల్లమల ప్రాంతానికి చెందిన అమాయక చెంచు ప్రజలను అరెస్టు చేయించడం ద్వారా తన నిరంకుశత్వాన్ని బయటపెట్టాడని ఆరోపించారు.
చెంచు నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి, తర్వాత నల్లమల డిక్లరేషన్ ప్రకటించడమే ప్రజా పాలన అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఎప్పటిలాగే ఆవేశంతో నిండినవే తప్ప, వాటిలో అంశం లేకుండా ఉంటున్నాయన్నారు.
రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని, వడగండ్ల వల్ల పంట నష్టపోయిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మహిళలు మహాలక్ష్మి పథకంలో రావాల్సిన రూ.2500 కోసం ఎదురుచూస్తుండగా, తులం బంగారం కోసం కాసుల కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. యువత స్కూటీల కోసం, విద్యార్థులు విద్యాభరోసా కార్డు కోసం నిరీక్షణలో ఉన్నారని అన్నారు.
రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ, సీఎం మాత్రం “నెంబర్ వన్ రాష్ట్రం” అంటూ వేరే పాట పాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి రంగులు మార్చే తీరును చూసి “నల్లమల అడవుల్లోని ఊసరవెల్లులకూ ఆశ్చర్యం కలుగుతుంది”నని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.