Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు.. నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు!

Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ కొత్వాలీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైంది. హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో జరిగిన ఓ ధార్మిక పూజా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని, వాల్మీకి (ఎస్సీ) సమాజం మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ శ్రీరామ్ సేన ధర్మార్త్ సేవా న్యాస్ సభ్యుడు అమిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) తో పాటు ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST Act) లోని పలు నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది.

ఖర్గే సభ తర్వాత ‘శుద్ధీకరణ’..
ఆగస్టు 8న హల్ద్వానీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం ఆగస్టు 11న కొందరు వ్యక్తులు ఆ మైదానంలో పరిశుభ్రతా కార్యక్రమం, శుద్ధీకరణ యజ్ఞం నిర్వహించారు.
రాహుల్ గాంధీ విమర్శలు..
ఆగస్టు 29న న్యూఢిల్లీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. దళిత నాయకుడైన ఖర్గే సభ తర్వాత ఆ స్థలాన్ని శుద్ధి చేయడం అంటరానితనం, దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదుదారుడి అభ్యంతరం..
ఈ శుద్ధీకరణ, పరిశుభ్రతా కార్యక్రమంలో స్వయంగా ఎస్సీ వర్గానికి చెందిన ప్రజలు కూడా పాల్గొన్నారని, దీనికి ఖర్గే కులానికి ఎలాంటి సంబంధం లేదని ఫిర్యాదుదారుడు అమిత్ కుమార్ పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాహుల్ గాంధీ దీనికి కులం రంగు పులిమి ప్రజలను దళిత వ్యతిరేకులుగా చిత్రీకరించారని, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఆరోపించారు.
నమోదైన చట్టపరమైన సెక్షన్లు – శిక్షల వివరాలు..
  1.  బీఎన్ఎస్ సెక్షన్ 196 (BNS Sec 196)..
    రెండు వర్గాలు లేదా సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని పెంచడం మరియు మత సామరస్యానికి భంగం కలిగించడం. ఇది నాన్-బెయిలబుల్ సెక్షన్. నేరం రుజువైతే కనిష్టంగా 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
  2. బీఎన్ఎస్ సెక్షన్ 299 (BNS Sec 299)..
    ఉద్దేశపూర్వకంగా ఏదేని వర్గం లేదా మతం మనోభావాలను దెబ్బతీసే చర్యలు. ఇందులోనూ 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉంది.
  3. ఎస్సీ/ఎస్టీ చట్టం సెక్షన్ 3(1)(Q)..

    ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వ్యతిరేకంగా విచారణ లేదా చర్యలు తీసుకునేలా తప్పుడు సమాచారం ఇవ్వడం. ఇందులో దోషిగా తేలితే 6 నెలల నుంచి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ ఫిర్యాదుపై హల్ద్వానీ సిటీ ఎస్పీ మనోజ్ కుమార్ కత్యాల్ స్పందిస్తూ.. కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *