Chandrababu: ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. కరువు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సంజీవని లాంటి ప్రతిష్టాత్మక పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 (Phase-1) ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మార్కాపురం జిల్లా పరిధిలోని దోర్నాల మండలం గంటావానిపల్లి వద్ద జరిగిన ఈ చారిత్రక ఘట్టంలో సీఎం స్వయంగా పాల్గొన్నారు.
ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జలహారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం స్థానిక రైతులతో కలిసి బటన్ నొక్కి వెలిగొండ గేట్లను ఎత్తి నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేశారు.
30 ఏళ్ల సంకల్పం.. నల్లమలలో జలసిరులు
బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు:
-
నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తి చేశా..1996 మార్చి 5న ఉమ్మడి ఏపీ సీఎంగా తానే వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత నవ్యాంధ్ర సీఎంగా మొదటి దశను తానే జాతికి అంకితం చేయడం జీవితంలో మర్చిపోలేని సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. కొండలను సైతం తొలగించి, ఎన్నో సవాళ్లను అధిగమించి కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చామని తెలిపారు.
-
శ్రీశైలం మల్లన్న నుంచి మార్కాపురం చెన్నకేశవుడి చెంతకు..శ్రీశైల మల్లన్న పాదాల చెంత నుంచి మార్కాపురం చెన్నకేశవస్వామి సన్నిధికి కృష్ణా జలాలు చేరాయని, వెలిగొండ రాకతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ‘బంగారు కొండ’గా మారబోతోందని పేర్కొన్నారు.
-
డబుల్ ఇంజిన్ సర్కార్ సహకారం:2024లో రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసిందని వెల్లడించారు. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.
ప్రాజెక్ట్ విశేషాలు – నిర్వాసితులకు పరిహారం..
-
రూ.7,983 కోట్లతో మొదటి దశ:మొదటి దశ పనులను రూ.7,983 కోట్ల వ్యయంతో పూర్తి చేశామని, మొత్తం 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో రిజర్వాయర్లలో నీరు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రత్యేక చొరవతో ప్రస్తుతం 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు.
-
నిర్వాసితుల సంక్షేమం:లబ్ధిదారులతో పాటు ప్రాజెక్టు కోసం భూములిచ్చిన నిర్వాసితులు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిర్వాసితులకు ఇప్పటికే రూ.1,071 కోట్లు చెల్లించామని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇటీవల రూ.165 కోట్లు విడుదల చేయడంతో పాటు ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నామని ప్రకటించారు.
ఫ్లోరైడ్ పీడనకు శాశ్వత పరిష్కారం..
వర్షాలు లేక బోర్లు ఎండిపోయి, ఫ్లోరైడ్ బారినపడి ప్రజలు, రైతులు అనుభవించిన నరకయాతనకు కృష్ణా జలాల రాకతో ముగింపు పడుతుందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ ఇకపై కేవలం చరిత్రగానే మిగిలిపోనుందని స్పష్టం చేశారు.
