TVK Vijay: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన సినిమాను తలపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌తో భేటీ అయిన విజయ్, ప్రభుత్వం ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
మేజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. 2006 తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. మొత్తం అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. విజయ్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 గురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ప్రస్తుతానికి ఆయన బలం 113కు చేరింది. మెజార్టీ నిరూపించుకోవడానికి ఆయనకు ఇంకా కేవలం ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే అవసరం.
బల నిరూపణకు సిద్ధం
గవర్నర్‌తో జరిగిన భేటీలో తన వద్ద తగినంత బలం ఉందని, అసెంబ్లీలో దానిని నిరూపించుకుంటానని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. అతిపెద్ద పార్టీగా తమకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరడంతో, గవర్నర్ అందుకు అంగీకరించారు. అన్నీ అనుకూలిస్తే శుక్రవారం లేదా శనివారం విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. దీనికోసం చెన్నైలో అప్పుడే ఏర్పాట్లు కూడా మొదలైపోయాయి.
ప్రజా తీర్పును గౌరవిస్తామన్న స్టాలిన్
మరోవైపు అధికార డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఉండకూడదని, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఆయన ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని, అలాగే అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయం విజయ్‌కు అధికారం చేపట్టడానికి మరింత సులభంగా మారింది.
ముందున్న అసలు సవాలు
ప్రస్తుతానికి గవర్నర్ అనుమతి లభించినప్పటికీ, అసెంబ్లీలో ఆ ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతును విజయ్ ఎలా కూడగడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే మాత్రం విజయ్‌కు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు లేదా చిన్న పార్టీల ఎమ్మెల్యేల మద్దతుపై విజయ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఈ కొత్త ప్రయాణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
