Dharmana Krishnadas: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు మరో ముదురు పాకాన పడింది. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని దువ్వాడ నిమ్మాడ హైవేపై చేసిన హల్‌చల్, దానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
అర్థరాత్రి హైవేపై హైడ్రామా
శుక్రవారం అర్థరాత్రి నిమ్మాడ జాతీయ రహదారిపై దువ్వాడ శ్రీనివాస్ తన వాహనాన్ని నిలిపి భారీ నిరసనకు దిగారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను అంతం చేసేందుకు ప్రత్యర్థులు కుట్ర పన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. “దమ్ముంటే రండి.. నేను ఇక్కడే ఉంటా” అంటూ బహిరంగ సవాల్ విసిరిన దువ్వాడ, ధర్మాన బ్రదర్స్ అవినీతిపై తాను మాట్లాడినందుకే తనను టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: RRB: నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. 22 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
ఆడియో లీక్.. కృష్ణదాస్ సంచలన అంగీకారం
ఈ వివాదానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆడియో కాల్. దివ్వెల మాధురి, కింజరాపు అప్పన్నల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కింజరాపు అప్పన్నతో తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే, తానేమీ దువ్వాడ జోలికి వెళ్లడం లేదని, దువ్వాడ తనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే తమ అనుచరులు స్పందిస్తున్నారని సమర్థించుకున్నారు. నా గురించి దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. ఆయనతో నాకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు అని కృష్ణదాస్ స్పష్టం చేశారు.
పార్టీలో ‘దువ్వాడ’ ఒంటరి అవుతున్నారా?
ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినట్లు పేర్కొన్న దువ్వాడ, తనను కావాలంటే పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించాలని కోరారు. ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ లపై ఆయన చేసిన అవినీతి ఆరోపణలు ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్యే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేశాయి.
