Farmers Suicide: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఇద్దరు ఆదివాసీ రైతులు తనువులు చాలిస్తున్నారు. ఇటీవల కాలంలో వరుస ఆత్మహత్యలతో తెలంగాణలో అలజడి నెలకొన్నది. ప్రభుత్వం ఒకవైపు రైతు రుణమాఫీ చేస్తున్నా, మరోవైపు రుణమాఫీ కాని రైతులు, అప్పులు తీరేదారిలేక చావే దిక్కని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా 24 గంటల్లో ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి.
Farmers Suicide: ఆదిలాబాద్ జిల్లాలో ఓ ప్రైవేటు బ్యాంకు అధికారుల వేధింపులు తాళలేక గిరిజన రైతు దేవ్‌రావు బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనను మరువక ముందే అదే జిల్లాలో ఊట్నూరు మండలంలో మరో రైతు చావే దిక్కని తనువు చాలించాడు. ఈ రెండు ఘటనలతో రైతులోకం నివ్వెరపోతున్నది. వరుస ఆత్మహత్య ఘటనలు ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్నాయి.
Farmers Suicide: ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు దేవ్‌రావు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి 2019లో రూ.3.5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నాడు. ఆరు నెలలకోసారి కిస్తీలు చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే ఆయనకు రూ.2 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయలేదు. ఇదే దశలో వానకాలం వేసిన కంది, పత్తి పంటలు సరిగా పండలేదు. ఈ లోగా అతని భార్య తీవ్ర అనారోగ్యంతో మంచాన పడింది. దీంతో ప్రైవేటు బ్యాంకు పర్సనల్‌లోన్ కిస్తీలు రెండింటిని చెల్లించలేకపోయాడు.
Farmers Suicide: కిస్తీలు చెల్లించాలంటూ ప్రైవేటు బ్యాంకు అధికారులు రైతు దేవ్‌రావుపై ఒత్తిడి చేయసాగారు. బ్యాంకుకు వెళ్లినరైతు కొంతకాలం గడువు ఇవ్వాలంటూ బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడ్డాడు. వారు ససేమిరా అన్నారు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. మళ్లీ ఇంటికొచ్చి కిస్తీ సొమ్ము చెల్లించాల్సిందేనని వేధించసాగారు. ఈ దశలో తనకు చావే దిక్కనుకున్నాడు. శనివారం స్వయంగా బ్యాంకులోపలికి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ధ్రువీకరించారు.
Farmers Suicide: అదే విధంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్పూరు మండలం లింగోజీ తండాకు చెందిన రాథోడ్ గోకుల్ అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. ఇలా శని, ఆదివారాల్లో 24 గంటలు తిరగక ముందే ఇద్దరు ఆదివాసీ రైతులు అప్పుల బాధ భరించలేక తనువులు చాలించడంపై విషాదం నిండుకున్నది.