Encounter: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో (జనవరి 21,22 తేదీల్లో) మరో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో 14 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇటీవలే పుజారీ కాంకేర్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌లో 18 మంది వరకు మావోయిస్టులు చనిపోయిన ఘటనను మరువక ముందే అదే రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో మళ్లీ ఈ ఎదురుకాల్పులు కలకలం రేపుతున్నాయి.
Encounter: గరియాబంద్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను కనుగొన్నారు. ఘటనా స్థలంలో ఆటోమేటిక్ ఆయుధాలు కూడా లభించాయి. మంగళవారం భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్యన జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ మేరకు ఇప్పటికే ఆ 12 మంది మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Encounter: గరియాబంద్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి కూడా చనిపోయినట్టు సమాచారం. ఆయనపై రూ.1 కోటి రివార్డు ఉన్నది. కుల్హాదీ ఘాట్ వద్ద భాలు డిగ్గీ అటవీ ప్రాంతంలో సుమారు 1,000 మంది భద్రతా బలగాలు.. 60 మంది మావోయిస్టులను చుట్టుముట్టినట్టు సమాచారం. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం వరకు అడపా తడపా ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 14 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు.
Encounter: ఈ ఎన్‌కౌంటర్‌లో కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఒక సైనికుడు గాయపడ్డాడు. క్షతగాత్రులను విమానంలో రాయ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనను భద్రతా బలగాలు ఒక పెద్ద విజయంగా అభివర్ణించాయి. గరియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రఖేచా, ఒడిశాలోని నువాపాడ ఎస్పీ రాఘవేంద్ర గుండాలా, ఒడిశా డీఐజీ నక్సల్ ఆపరేషన్ అఖిలేవ్వర్ సింగ్, కోబ్రా కమాండెంట్ డీఎస్ కథైత్ పర్యవేక్షిస్తున్నారు.