ED: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఒకవైపు ఏసీబీ విచారణ ప్రక్రియ కొనసాతుండగా, మరోవైపు ఈడీ కూడా విచారణ ప్రక్రియకు రెడీ అయింది. ఏసీబీ కేసు విచారణపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ వేశారు. దీనిని తొలగించాలంటూ ఏసీబీ హైకోర్టును కోరగా, ఈ నెల 31 వరకు ఎలాంటి విచారణకు ముందుకు సాగొద్దంటూ నిన్ననే హైకోర్టుకు తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగానే మళ్లీ ఈడీ నోటీసుల కలకలం రేగింది.
ED: జనవరి నెలలో విచారణ చేపట్టేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ మేరకు జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరు కావాల్సిందిగా ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులను జారీ చేసింది. అదేనెల 7న విచారణకు రావాల్సిందిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది.
ED: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఏసీబీ, హెచ్ఎండీఏ అధికారుల నుంచి ఈడీ వివరాలను సేకరించింది. ఫార్ములా ఈ కార్ రేస్ పోటీల నాటి పూర్తి వివరాలను తన వద్ద ఉంచుకున్నది. వాటి ఆధారంగా కేసు విచారణకు దిగింది. దీనిపై అంతా ఆసక్తి నెలకొన్నది. ఇప్పటికే ఏసీబీ విచారణపై కోర్టుకెళ్లిన కేటీఆర్.. ఈడీ కేసు విచారణను ఎదుర్కొంటారా? లేక మళ్లీ కోర్టుకెళ్లే అవకాశం ఉన్నదా? అన్న విషయాలపై ఉత్కంఠ నెలకొన్నది.