Blue Drum Case: దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మర్చంట్ నేవీ అధికారి అయిన భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను అతికిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి సిమెంట్‌తో కూడిన నీలిరంగు డ్రమ్ములో దాచిపెట్టిన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు మీరట్ జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష (మరణశిక్ష) ఖరారు చేసింది.
జిల్లా మరియు సెషన్స్ జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా బుధవారం ఈ శిక్షను ఖరారు చేస్తూ మహాభారతాన్ని ఉటంకించారు. “తగిన శిక్షను విధించడం కూడా ఒక విధమైన ధర్మమే” అని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తీర్పు వెలువడిన వెంటనే కోర్టు హాలులో ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు మిన్నంటగా, బయట ప్రజలు, న్యాయవాదులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
దేశాన్ని వణికించిన ‘బ్లూ డ్రమ్’ కేసు నేపథ్యం..
2025 మార్చి 3న మర్చంట్ నేవీ అధికారైన సౌరభ్ రాజ్‌పుత్‌ను ఆయన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లా కలిసి పక్కా పథకం ప్రకారం హతమార్చారు. హత్య అనంతరం సౌరభ్ శరీరాన్ని పలు ముక్కలుగా నరికి, వాటిని ఒక నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి, వాసన రాకుండా ఉండటానికి మొత్తం సిమెంట్‌తో నింపేశారు. మరుసటి రోజే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటి నుంచి డ్రమ్మును స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు. పోలీసులు దాదాపు 1,000 పేజీల చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. 13 నెలల పాటు 126 విచారణల అనంతరం కోర్టు వీరిద్దరినీ దోషులుగా తేల్చింది.
మా కూతురికి ఉరి వేసినా అభ్యంతరం లేదు.. సొంత తల్లిదండ్రుల ప్రకటన
ఈ కేసులో అత్యంత భావోద్వేగమైన పరిణామం ఏమిటంటే.. నిందితురాలు ముస్కాన్ రస్తోగి చేసిన దారుణానికి ఆమె సొంత తల్లిదండ్రులే అసహ్యించుకున్నారు. తమ కుమార్తెకు గనక కోర్టు ఉరిశిక్ష విధిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముస్కాన్ తల్లిదండ్రులు కోర్టుకు లిఖితపూర్వక ప్రకటన సమర్పించారు. అటు సౌరభ్ తల్లి రేణు రాజ్‌పుత్, ఆయన సోదరుడు కోర్టు హాలులోనే ఉండి కన్నీటిపర్యంతమయ్యారు. “కలిసి ఉండటం ఇష్టం లేకపోతే విడిపోండి.. అంతే తప్ప ఒకరి కడుపుకోత మిగుల్చుతూ హత్యలు చేయకండి. ఇలాంటి దారుణానికి ఒడిగట్టే ప్రతి ఒక్కరికీ ఉరిశిక్షే సరైన గుణపాఠం” అని సౌరభ్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
జైల్లో నిద్రలేని రాత్రులు – ఉరికి ముందు నిందితుల పరిస్థితి..
తీర్పు ప్రకటనకు ముందు ముస్కాన్, సాహిల్ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తీర్పు వెలువడే ముందు రోజు రాత్రి ఇద్దరూ సరిగ్గా నిద్రపోలేదని, మంగళవారం రాత్రి భోజనం గానీ, బుధవారం ఉదయం టిఫిన్ గానీ ముట్టుకోలేదని సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ తెలిపారు.
జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరచగా.. గతంలో ఏమైనా నేరాలు చేశావా అని జడ్జి సాహిల్‌ను అడగ్గా లేదని చెప్పాడు. శిక్షపై ఏదైనా మాట్లాడతారా అని అడిగితే మాట్లాడటానికి నిరాకరించాడు.
దోషిగా తేలినప్పటి నుంచి ముస్కాన్ ఇతర మహిళా ఖైదీలతో మాట్లాడటం మానేసి రోజంతా ఒంటరిగా ప్రార్థనలు చేసుకుంటోందని అధికారులు తెలిపారు. ఇంట్లో ఉన్న తన చిన్న కూతురిని చూడాలని తల్లడిల్లుతోందని, అయితే ఆమెను చూసేందుకు ఇప్పటివరకు బంధువులెవరూ జైలుకు రాలేదని పేర్కొన్నారు. తీర్పు నేపథ్యంలో నిందితులకు ఖైదీల డ్రెస్ కోడ్ అమలు చేయడంతో పాటు, పురుష ఖైదీని వేరే జైలుకు, మహిళా ఖైదీని ప్రత్యేక మహిళా కారాగారానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జైలు నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఇకపై ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఉండదు.
