Tibet: టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి 126 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 400 మంది గాయపడ్డారు. వాహనాలు, రహదారులు ధ్వంసమయ్యాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఈ భూకంపం ప్రభావం నేపాల్, భారత్, చైనా తదితర ప్రాంతాల్లోనూ చోటుచేసుకుంది. ప్రకంపనల తీవ్రతతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 6:30 గంటలకు మొదటి భూకంపం సంభవించగా, రిక్టరు స్కేలుపై 7.1 తీవ్రత నమోదైంది. ఆ తర్వాత 4 తీవ్రతతో పలుమార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 24 గంటల్లో కనీసం 20 సార్లు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
టిబెట్ ప్రాంతంలో భూకంపాలు తరచుగా సంభవిస్తున్నప్పటికీ, 7.1 తీవ్రతతో ప్రకంపనలు రావడం చాలా అరుదైనది. 20వ శతాబ్దం నుంచి ఇప్పటివరకు ఈ స్థాయిలో కేవలం తొమ్మిది సార్లు మాత్రమే ప్రకంపనలు నమోదయ్యాయి.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితిని మెరుగుపరచేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.