Divvela madhuri: వైసీపీ నేత దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులపై తీవ్రంగా స్పందించారు. గత కొన్ని నెలలుగా ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. రెండు సంవత్సరాల క్రితం పవన్ కల్యాణ్‌పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది.
ఈ నేపథ్యంలో, దివ్వెల మాధురి, తమపై జరుగుతున్న అనుచిత పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె, వైసీపీ కార్యకర్తలతో కలిసి, సీఐకి వీడియోలతో పాటు ఆధారాలను సమర్పించారు.
మాధురి మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత వంటి నేతలు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు.
ఈ హామీలను నమ్ముతూ, దివ్వెల మాధురి, తనపై, వైసీపీ కార్యకర్తలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై త్వరగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరారు. అలాగే, కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీట వేస్తుందని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆమె నమ్మకంతో అడిగారు.