Food Divorce: దాంపత్య బంధంలో లేదా ప్రేమలో ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ ఇద్దరి అభిరుచులు ఒకేలా ఉండాలని రూలేమీ లేదు. ముఖ్యంగా చాలా ఇళ్లలో సాయంత్రం కాగానే తలెత్తే అతిపెద్ద సమస్య.. “ఈరోజు రాత్రికి ఏం తినాలి?”. ఒకరు ‘నువ్వే చెప్పు’ అంటే, మరొకరు ‘ఏదైనా పర్లేదు’ అనడం.. తీరా ఒకరు రోటీ అంటే మరొకరు నూడుల్స్ కావాలనడం.. ఇలాంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు చివరికి అసహనానికి, ఒత్తిడికి దారితీస్తుంటాయి.
ఇలాంటి రోజువారీ సమస్యల నుంచి బయటపడేందుకు ఆధునిక జంటలు ఇప్పుడు ‘ఫుడ్ డివోర్స్’ (Food Divorce) అనే సరికొత్త జీవనశైలిని ఎంచుకుంటున్నారు.
‘ఫుడ్ డివోర్స్’ అంటే విడిపోవడం కాదు.. ఇష్టాలకు గౌరవం!
‘ఫుడ్ డివోర్స్’ అనే పేరు వినగానే ఏదో వైవాహిక విడాకులు అనుకుంటే పొరపాటే. ఒకే ఇంట్లో ఉంటూనే.. ఆహారం విషయంలో ప్రతిసారీ ఒకరి కోసం మరొకరు తమ ఇష్టాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించుకోవడమే ఈ విధానం..
-
రాజీ లేని ఆనందం: ఒకరికి తేలికపాటి ఇంట్లోని కూర-అన్నం తినాలనిపిస్తే, మరొకరికి బయటి నుంచి తెప్పించిన పాస్తా తినాలనిపించవచ్చు. ఒకరికి 7 గంటలకే డిన్నర్ చేసే అలవాటు ఉంటే, మరొకరికి రాత్రి 10 గంటలకు తినాలని ఉండొచ్చు. ఈ తేడాల కోసం ఒకరిపై ఒకరు పట్టుబట్టకుండా.. ఎవరికి నచ్చిన ఆహారాన్ని, నచ్చిన సమయంలో ప్రశాంతంగా ఆస్వాదించడమే ‘ఫుడ్ డివోర్స్’.
-
డైట్ & అలర్జీల వెసులుబాటు: శాకాహారం-మాంసాహారం భేదాలు, ఫిట్‌నెస్ డైట్లు, ఆహార అలర్జీలు ఉన్నవారికి ఈ విధానం పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. రోజూ “నాకు నచ్చింది నువ్వు ఎందుకు తినవు?” అనే నిరాశలకు ఇది తెరదించుతుంది.
వేర్వేరుగా తింటే బంధం బలహీనపడుతుందా?
కేవలం వేర్వేరు ఆహారాలు తిన్నంత మాత్రాన భార్యాభర్తల మధ్య బంధం దెబ్బతినదు. ఇద్దరి నిద్రపోయే వేళలు, అభిరుచులు వేరుగా ఉన్నట్లే ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉండటం సహజం:
-
కలిసి గడిపే సమయానికి ప్రాధాన్యం: ఫుడ్ డివోర్స్ అంటే ఎప్పటికీ కలిసి కూర్చోకూడదని కాదు. వారాంతాల్లో, ప్రత్యేక సందర్భాల్లో కలిసి రెస్టారెంట్లకు వెళ్లవచ్చు. ఇద్దరికీ ఒకే వంటకం నచ్చిన రోజు కలిసి భోజనం చేయవచ్చు.
-
స్వేచ్ఛను గౌరవించడం: ఒకరి అలవాట్లను, ప్రాధాన్యతలను మరొకరు హృదయపూర్వకంగా గౌరవించినప్పుడే బంధం మరింత పటిష్టమవుతుంది.
అయితే, భాగస్వామితో మాట్లాడటం ఇష్టం లేకనో లేదా దూరం పెట్టడానికో వేర్వేరుగా తింటున్నట్లయితే అది అసలైన సమస్యకు సంకేతం. కానీ, పరస్పర అవగాహనతో, ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం కోసం ఒకరి ఆహార స్వేచ్ఛను మరొకరు గౌరవించుకుంటే అది దాంపత్యంలో మరింత సంతోషాన్ని నింపుతుంది.
