Dhanush: హీరో ధనుష్ లో మంచి దర్శకుడు కూడా ఉన్నాడు. అతను హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’ మూవీ గత యేడాది విడుదలై తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. అదే ఊపుతో ధనుష్ తన దర్శకత్వంలో మేనల్లుడు పవీష్ ను హీరోగా పెట్టి ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ అనే సినిమాను రూపొందించాడు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయాలని అనుకున్నాడు. అయితే… పలు మార్లు వాయిదా పడిన అజిత్ మూవీ ‘విడా ముయార్చి’ ఫిబ్రవరి 6న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. దాంతో దానితో పోటీ పడటం ఇష్టం లేని ధనుష్ ఓ వారం ముందుగానే ‘నిలవుకు ఎల్ మేల్ ఎన్నడి కోబం’ను రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నాడట. ఇప్పటికే తొలికాపీ సిద్థం అయ్యింది కాబట్టి సెన్సార్ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసుకుని, ఈ చిత్రాన్ని జనవరి 30న రిలీజ్ చేస్తారని అంటున్నారు. స్వీయ దర్శకత్వంలో ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబం’ను నిర్మించడంతో పాటు ధనుష్ ఓ కీ రోల్ కూడా పోషించాడు.