Delhi Protest: దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ శనివారం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఉద్రిక్తత పతాక స్థాయికి చేరింది. ఆందోళనకారులు రాజధానిలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని కీలకమైన ఘాజీపూర్ (Ghazipur) బోర్డర్ వద్ద అధికారులు భారీ కాంక్రీట్, రాతి బారికేడ్లను (Heavy stone barricades) ఏర్పాటు చేశారు. ఢిల్లీలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండటంతో సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల డీజీపీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ కీలక లేఖ..
ఢిల్లీ సౌత్ డిస్ట్రిక్ట్ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు ఢిల్లీ నగరంలోని అంతర్గత సరిహద్దుల్లోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం గుర్తింపు కార్డులు, అత్యవసర ప్రయాణ పత్రాలు ఉన్నవారిని మాత్రమే క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత అనుమతిస్తున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీజేపీ ఇచ్చిన పిలుపుతో దేశ రాజధాని ప్రాంతం మొత్తం పూర్తి సైనిక వలయంలా మారిపోయింది.
