Dalai Lama: టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియపై చైనా మరోసారి తన పట్టును బిగించింది. తన వారసుడిని నిర్ణయించే అధికారం ప్రస్తుత దలైలామాకు లేదని బీజింగ్ స్పష్టం చేసింది. ఈ మేరకు చైనాకు చెందిన సీనియర్ అధికారి, భారత్‌లోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ తన ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. దలైలామా పునర్జన్మ పద్ధతిని ఆయన వ్యక్తిగతంగా నిర్ణయించకూడదని ఆయన ఆ పోస్ట్‌లో నొక్కి చెప్పారు.
షూ ఫెయిహాంగ్ తన పోస్ట్‌లో దలైలామా పునర్జన్మ విధానంపై కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించారు. దలైలామా వ్యవస్థ కొనసాగుతుందని 14వ దలైలామా స్వయంగా నిర్ధారించినప్పటికీ, టిబెటన్ బౌద్ధమతంలో వారసుడి ఎంపికకు ఒక ప్రత్యేక పద్ధతి ఉందని ఆయన తెలిపారు. ‘లివింగ్ బుద్ధ’ (జీవన బుద్ధుడు) విధానంలో దాదాపు 700 సంవత్సరాలుగా ఈ పునర్జన్మ పద్ధతి కొనసాగుతోందని చైనా పేర్కొంది. ప్రస్తుతం చైనాలోని జిజాంగ్ (టిబెట్), సిచువాన్, యునాన్, గన్సు, క్వింగ్‌హాయ్ ప్రావిన్స్‌లలో దాదాపు 1,000 రకాల పునర్జన్మ పద్ధతులను అనుసరిస్తున్నారని ఆయన వెల్లడించారు.
14వ దలైలామా ఈ సుదీర్ఘ చారిత్రక సంప్రదాయంలో ఒక భాగం మాత్రమేనని, అంతకు మించి కాదని చైనా వాదిస్తోంది. ఈ సంప్రదాయాలు ఆయనతో మొదలు కాలేదని, ఆయనతో అంతం కూడా కావని బీజింగ్ స్పష్టం చేసింది. పునర్జన్మ విధానాన్ని కొనసాగించాలా లేదా పక్కన పెట్టాలా అనేది నిర్ణయించే అధికారం దలైలామాకు లేదని, అది కేవలం చారిత్రక, మతపరమైన సంప్రదాయం ఆధారంగానే జరుగుతుందని చైనా తేల్చి చెప్పింది. చైనా చట్టాలు, మతపరమైన ఆచారాల ప్రకారమే పునర్జన్మ ప్రక్రియ జరగాలని చైనా విదేశాంగ శాఖ గతంలోనే ప్రకటించింది.
దలైలామా వారసుడి ఎంపికపై భారత ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించిన మర్నాడే చైనా రాయబారి స్పందించడం గమనార్హం. జూలై 2, 2025న కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మాట్లాడుతూ, “ఆచారాలను కొనసాగించే హక్కు దలైలామాకు ఉంది” అని వ్యాఖ్యానించారు. దలైలామా పునర్జన్మ అనేది పూర్తిగా మతపరమైన అంశమని, దానిపై నిర్ణయం తీసుకునే హక్కు కేవలం ఆయనకు, బౌద్ధ సంప్రదాయాలకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇతరుల జోక్యానికి తావు లేదని రిజుజు తేల్చిచెప్పారు. ఇది చైనా చేస్తూ వస్తున్న వాదనలకు ఒక బలమైన కౌంటర్ ఇచ్చినట్లయింది.
Also Read: Donald Trump: బ్రిక్స్ దేశాలకు ట్రంప్ బెదిరింపు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఆగిపోతుందా?
Dalai Lama: కొత్త దలైలామాను గుర్తించడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుత 14వ దలైలామా, టెంజిన్ గ్యాట్సోను గుర్తించడానికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది. దలైలామాగా ఉన్నవారు శరీరాన్ని విడిచి వెళ్ళిన తర్వాత, లామో లాత్సో సరస్సు వద్ద తపస్సు చేసే అత్యున్నత స్థాయి బౌద్ధ సన్యాసులకు కొత్త అవతారంలో సాక్షాత్కరిస్తారని నమ్మకం. బౌద్ధ సన్యాసులకు ఆయన కలలో కనిపిస్తారని కూడా విశ్వసిస్తారు.
దలైలామా మరణానంతరం, వారి పార్థివ దేహ భంగిమ ఏ దిక్కువైపు తిరిగి ఉంటే, ఆ దిక్కు నుంచే కొత్త దలైలామాను వెతకడం ప్రారంభిస్తారు. పార్థివ దేహాన్ని దహనం చేసిన తర్వాత వెలువడే పొగ ఎటువైపు వీస్తుందో, ఆ మార్గాన అన్వేషణ జరుగుతుంది. ఎవరైనా బాలుడు దలైలామా పోలికలతో కనిపిస్తే, అతడికి దలైలామా గతంలో వినియోగించిన వస్తువులను చూపిస్తారు. వాటిని అతడు గుర్తిస్తున్నాడా లేదా అని తెలుసుకుంటారు. 13వ దలైలామాకు చెందిన వస్తువులను రెండేళ్ల వయసులో ఉన్న టెంజిన్ గ్యాట్సో గుర్తించిన వెంటనే, ఆయనను దలైలామాగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఆయనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
దలైలామా తర్వాతి స్థానం పంచెన్ లామాది. వీరు టిబెట్‌లోని ప్రసిద్ధ బౌద్ధ మఠం తాశీ లున్ పోకి మఠాధిపతిగా ఉంటారు. వీరే దలైలామా వారసుడిని గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తారు. దలైలామా 90వ పుట్టినరోజు (జూలై 6, 2025) సందర్భంగా చైనా ఈ అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.