Karnataka: కర్ణాటక మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్డ్ కులాలకు అంతర్గత రిజర్వేషన్లు అమలు చేయడంపై సలహా ఇచ్చేందుకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయం ప్రకారం, రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఇది తదుపరి నిర్ణయం తీసుకునే ముందు డేటాను సమీక్షిస్తుంది. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కూడా కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
షెడ్యూల్డ్ కులాలకు అంతర్గత రిజర్వేషన్లు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని, డేటా వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ స్పష్టం చేశారు. అలాగే మూడు నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నివేదిక సమర్పించాలని కమిషన్‌ను ఆదేశించింది. అదే సమయంలో, తదుపరి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక నుండి ఏదైనా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా తీసుకుంటారు.