Tirumala: తిరుమల క్షేత్రం ప్రస్తుతం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలివస్తున్న భక్తులతో తిరుమల గిరులు కోలాహలంగా మారాయి. భక్తుల సంఖ్య అంచనాలకు మించి ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీనివల్ల కంపార్ట్మెంట్లలో చోటు లేక వేలాది మంది భక్తులు బయట క్యూ లైన్లలోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతోంది. ఎండలు పెరుగుతున్నా, నిరీక్షణ సమయం ఎక్కువగా ఉన్నా సరే.. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు ఓపికగా వేచి చూస్తున్నారు. టికెట్లు లేని సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో తిరుమల శ్రీవారిని మొత్తం 72,724 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా 31,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.59 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, అన్నప్రసాదం పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు.
