Love: ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన బూరుగుల కంబగిరి రాముడు (24), నల్లబోతుల భారతి (20) అనే యువ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భారతికి రెండు సంవత్సరాల క్రితం తన మేనమామ కుమారుడు శివప్రసాద్‌తో వివాహమైంది. కానీ కొంత కాలం తర్వాత భర్తను వదిలి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ క్రమంలో తనకు వరుసకు అన్న అయ్యే రాముడుతో ప్రేమలో పడింది. ఇద్దరూ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: Pune Rape Case: యువతిపై డెలివరీ బాయ్ అత్యాచారం కేసులో ట్విస్ట్.. డెలివరీ బాయ్ కాదు, ఫ్రెండే.. ఫిర్యాదు చేసిందంటే..
వీరి వ్యవహారం ఇరుకుటుంబాలకు తెలిసిపోయింది. కానీ వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు కావటంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం రాముడు తన తండ్రికి ఫోన్ చేసి.. “మేమిద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నాం” అని చెప్పి, తన మొబైల్‌లో లొకేషన్ షేర్ చేసి, వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే సరికి యువ జంట చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.