Employee Benefits: కార్పొరేట్ ఆఫీసుల పద్ధతులు ఇప్పుడు బాగా మారుతున్నాయి. ఒకప్పుడు కంపెనీలు కేవలం ఒక సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చి వదిలేసేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. ఉద్యోగుల మానసిక ప్రశాంతత కోసం కౌన్సెలింగ్, ఫోన్ ద్వారా డాక్టర్ల సలహాలు, ఉచితంగా జిమ్ మెంబర్‌షిప్‌లు, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు కూడా ఆఫీసులే ఉచితంగా ఇప్పిస్తున్నాయి.
బయటకు చూస్తే ఉద్యోగులను సంతోషపెట్టడానికి కంపెనీలు ఊరికే డబ్బులు తగలేస్తున్నట్లు కనిపించవచ్చు. కానీ దీని వెనుక ఒక పక్కా లెక్క ఉంది. ఉద్యోగుల ఆరోగ్యం బాగుంటే కంపెనీలకే ఇన్సూరెన్స్ ఖర్చులు లక్షల్లో మిగులుతాయని ప్రముఖ సంస్థ ‘ప్లమ్’ (Plum) తన రిపోర్ట్‌లో తేల్చిచెప్పింది.
ఒక్కో ఉద్యోగిపై రూ.480 ఆదా.. లెక్కలు ఇవే..
నాలుగేళ్లలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించి ఈ నివేదిక తయారుచేశారు.. ఉద్యోగికి పెద్ద రోగం వచ్చి ఆసుపత్రి పాలయ్యేదాకా చూడకుండా.. ముందే ఫోన్లో డాక్టర్ సలహాలు, రెగ్యులర్ టెస్టులు చేయించే కంపెనీల్లో పెద్ద పెద్ద రోగాల ఖర్చులు 13 శాతం తగ్గాయి. దీనివల్ల ఒక్కో ఉద్యోగికి కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంలో కంపెనీకి సగటున రూ.480 వరకు ఆదా అవుతోంది. ఉదాహరణకు 1,000 మంది పనిచేసే ఆఫీస్‌లో అయితే ఏటా దాదాపు రూ.4.8 లక్షల వరకు కంపెనీకి మిగులుతోంది. రాబోయే రోజుల్లో ఈ ఆదా ఇంకా పెరగనుంది.
మంచి పాలసీలు ఇస్తున్న కంపెనీలు
గతంలో పూర్తి హెల్త్‌కేర్ ఇచ్చే కంపెనీలు కేవలం 5 శాతమే ఉండేవి. ఇప్పుడది 23 శాతానికి చేరింది. రూ.5 లక్షల కంటే ఎక్కువ ఇన్సూరెన్స్ ఇచ్చే ఆఫీసులు 53 శాతం పెరిగాయి. అలాగే డెలివరీ (కాన్పు) ఖర్చులకు రూ.75,000 కంటే ఎక్కువ ఇచ్చే కంపెనీలు రెట్టింపు అయ్యాయి.
కంపెనీలు ఇస్తున్న ఈ ఆఫర్లతో చాలామంది జీవితంలో తొలిసారి తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. ఉద్యోగుల్లో 74 శాతం మంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి నిపుణులతో మాట్లాడారు. 61 శాతం మంది ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
లైఫ్‌లో మొదటిసారి జిమ్‌కి..
సుమారు 31 శాతం మంది కంపెనీ ఫ్రీ జిమ్ ఆప్షన్ ఇవ్వడంతో జీవితంలో మొదటిసారి జిమ్‌లో చేరారు. రెండోసారి టెస్టులు చేయించుకున్న వారిలో 70 శాతం మందికి గుండె ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు మెరుగుపడ్డాయి.
కుటుంబ సభ్యులకూ ఉపయోగం..
ఆన్‌లైన్‌లో డాక్టర్లను సంప్రదించడంలో 37 శాతం మంది, ఓపీడీ (OPD) ఖర్చుల్లో 24 శాతం మంది ఉద్యోగుల ఇంట్లోని కుటుంబ సభ్యులే వాడుకున్నారు.
కంపెనీలకిది మంచి పెట్టుబడి..
భారత్‌లో ఇప్పటికీ 40 శాతం మందికి కూడా సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. అందుకే ఉద్యోగుల ఆరోగ్యం కోసం కంపెనీలు చేసే ఖర్చు నష్టం కాదని, ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటే ఉత్సాహంగా పనిచేస్తారని, కంపెనీలు మారకుండా ఎక్కువ కాలం ఉంటారని, అంతిమంగా ఇది కంపెనీకే పెద్ద లాభమని నివేదిక స్పష్టం చేసింది.
