Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ ప్రజలతో తమ కుటుంబానికి దాదాపు 40 ఏళ్ల బంధం ఉందని చెప్పారు. కష్టం అని వచ్చిన ప్రతి ఒక్కరికీ అండగా నిలిచామని, అందుకే అన్ని మతాలు, కులాల వారు తనను సెక్యులర్ నాయకుడిగా చూస్తున్నారని అన్నారు. అందుకే 2014లో ఎంఐఎం తరపున పోటీ చేసినా, ప్రజలు తనకు మంచి మెజారిటీ ఇచ్చి రెండో స్థానంలో నిలబెట్టారని గుర్తు చేసుకున్నారు.
నవీన్ ఖాన్ వ్యాఖ్యలపై మండిపాటు
బీజేపీ నేత బండి సంజయ్ తనను ‘నవీన్ ఖాన్’ అని సంబోధించడంపై నవీన్ యాదవ్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. “బండి సంజయ్ గారూ, ఇక్కడ మీరు ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే చూపించి ఓట్లు అడగండి. అంతేగాని, ఇక్కడ హిందువులు, ముస్లింల మధ్య మత కల్లోలాలు సృష్టించేలా మాట్లాడొద్దు” అని ఆయన ఘాటుగా చెప్పారు. బస్తీల్లో అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటుంటే ఈ ప్రాంతం కబరస్థాన్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. “మేము కులం, మతం తేడా లేకుండా అన్ని పండుగలను – రంజాన్, క్రిస్మస్, దసరా, బతుకమ్మ, సంక్రాంతి – అందరం కలిసి జరుపుకుంటాం. ఇక్కడ సెక్యులర్ వాతావరణం ఉంది. ప్రజలకు కుల మతాల గురించి ఎలాంటి ఆలోచనలు లేవు” అని నవీన్ యాదవ్ స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ దుష్ప్రచారంపై ఆగ్రహం
తనపై బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్‌ఎస్ వాళ్ళు తనను రౌడీ, గూండా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మరోవైపు బీజేపీ వాళ్లు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి లేనిపోని ఆరోపణలు చేసి తనను ఓడించాలని చూస్తున్నాయని ఆరోపించారు. గత 40 ఏళ్లలో తాము ఎక్కడా ఒక్క రూపాయి కూడా వసూళ్లు చేయలేదని, ఎవరినీ ఇబ్బంది పెట్టడం తమ నైజం కాదని నవీన్ యాదవ్ అన్నారు. “నేను గెలిస్తే ఎలాంటి టాక్స్‌లు ఉండవు. పేదవాడు ప్రశాంతంగా ఉండాలనేదే మా ఆలోచన” అని భరోసా ఇచ్చారు. చివరగా, జూబ్లీహిల్స్ ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు.
