Revanth Reddy: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతూనే, జిల్లా ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు.
గత కొన్ని రోజులుగా భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని, మెడికల్ బోర్డును తీసేస్తారని జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. “భూపాలపల్లి జిల్లా రద్దు కాదు, ఎక్కడికీ పోదు. కొందరు కావాలనే విషప్రచారం చేస్తున్నారు, అలాంటి మాయమాటలు నమ్మకండి. మెడికల్ బోర్డును రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి అస్సలు లేదు” అని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఉన్న జిల్లాలను తొలగించే ప్రసక్తే లేదని ప్రజలకు భరోసా ఇచ్చారు.
కాకతీయ విద్యార్థులు, సింగరేణి కార్మికులే మన బలం
తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ (KU) విద్యార్థుల పాత్రను సీఎం ప్రత్యేకంగా కొనియాడారు. “తెలంగాణ సాధనలో కేయూ విద్యార్థులు కర్త, కర్మ, క్రియగా నిలిచారు. వారి త్యాగాలు వెలకట్టలేనివి” అని అన్నారు. అలాగే, దేశానికే వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులు అందరికీ ఆదర్శమని రేవంత్ రెడ్డి కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి వల్లే భూపాలపల్లి ఈ స్థాయికి చేరిందని గుర్తు చేశారు.
కేసీఆర్, మోదీపై విమర్శల బాణాలు
బీఆర్ఎస్, బీజేపీ తీరుపై సీఎం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “గల్లీలో మోరీ (డ్రైనేజీ) తీయాలన్నా, లైట్లు వేయాలన్నా కేసీఆర్ వస్తాడా లేక మోదీ వస్తాడా? స్థానిక కౌన్సిలర్, ఎమ్మెల్యే మాత్రమే మీకు అండగా ఉంటారు. బీఆర్ఎస్కు ఓటేస్తే మళ్ళీ గోస పడతాం” అని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో కేవలం వారి కుటుంబానికే ఫాంహౌస్‌లు వచ్చాయని, కానీ పేదలకు ఇళ్లు రాలేదని విమర్శించారు. ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు.
బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి
ఫోన్ ట్యాపింగ్‌పై స్పందిస్తూ, బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి’ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ట్యాపింగ్‌ల ద్వారా వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్‌ను, కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు విచారించడం లేదని బీజేపీ నేత కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేసే వరకు కిషన్ రెడ్డిని ‘కిషన్ రావు’ అనే పిలుస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాసర నుంచి భద్రాచలం వరకు అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
