Cm Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తొలి ప్రకటన వచ్చిన డిసెంబర్ 9న, తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలు జరుపుతామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు తెలంగాణ తల్లి ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయని ఆరోపించారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంపై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 9 సాయంత్రం 6.05 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగే వేళ, అందరూ ఈ ఉత్సవంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఇందులో ముఖ్యంగా, తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాత్మకంగా మాతృమూర్తి పట్ల ఉన్న గౌరవం అభిమానం చూపించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఎం తెలిపారు.
మునుపటి దశలో ఉద్యమం ఉవ్వెత్తి, అందరూ ‘TG’ పదాలను తమ వాహనాలపై రాసుకున్న సమయంలో, ఈ పదాలను అధికారికంగా స్వీకరించి అమలు చేసినట్లు గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు గీతం లేకపోయిందని, అందుకే ‘జయజయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించామని చెప్పారు.