CM revanth: తెలంగాణలో జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులకు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రగతి భవన్‌ను ప్రజల కోసం ప్రజాభవన్‌గా మార్చినట్లు ఆయన తెలిపారు. బిహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం నుంచి ఎన్నోమంది సివిల్స్‌లో విజయాలు సాధిస్తున్నారని, తెలంగాణ యువత కూడా అదే స్థాయిలో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకే ఏడాదిలో 55,000 నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం గుర్తుచేశారు. 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని, మార్చి 31 నాటికి ఈ నియామకాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. తాము నిరుద్యోగుల కోసం పనిచేస్తుంటే, కొందరు కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఉద్యోగ నియామకాల విషయంలో విఫలమైందని విమర్శించారు.
సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్ళే ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించాలని ఆకాంక్షిస్తున్నామని, ఆర్థిక సాయం కేవలం ప్రోత్సాహంగా భావించాలని సీఎం సూచించారు. కష్టంతో కమిట్మెంట్ ఉంటేనే విజయం సాధ్యమని అన్నారు.జాబ్ క్యాలెండర్ ప్రకారం రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం నియామకాలు చేపడుతున్నామని, పారదర్శకతకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నట్లు సీఎం తెలిపారు.