Chandrababu: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం నుంచి విపత్తు నిర్వహణ ఉన్నతాధికారులు, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను సన్నద్ధతపై సమగ్రంగా చర్చించారు. దక్షిణ కోస్తాంధ్రతో పాటు దిగువ జిల్లాలు, రాయలసీమ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.
గతంలో వచ్చిన ‘అర్నబ్’ తుపానుతో పోల్చుకుంటే ‘మురసు’ తీవ్రత కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉందని అధికారులు వివరించారు. అయినప్పటికీ యంత్రాంగం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఈదురు గాలుల కారణంగా వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ముప్పు ఉన్నందున, విద్యుత్ శాఖ తగినన్ని ప్రత్యామ్నాయ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, సిబ్బందిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
భారీ వర్షాల వల్ల వచ్చే వరద నీటిని సమర్థంగా ఒడిసిపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమర్థ నీటి నిర్వహణ (Water Management) ద్వారా గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం పరిధిలోని అన్ని చెరువులను వర్షపు నీటితో నింపేలా ప్రణాళికలు అమలు చేయాలని చెప్పారు. అలాగే దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్ పరిధిలోని ప్రధాన, మధ్యతరహా రిజర్వాయర్లలోకి వరద నీటిని గరిష్ఠ స్థాయిలో నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కంట్రోల్ రూమ్‌లను 24 గంటలు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.
